కాంగ్రెస్ రాజ్యంలో చాలా క‌రువుతో అవ‌స్థ‌లు ప‌డ్డామని వైరా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ అన్నారు.

విధాత‌: కాంగ్రెస్ రాజ్యంలో చాలా క‌రువుతో అవ‌స్థ‌లు ప‌డ్డామని వైరా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ అన్నారు. ప‌ల్లెలు, గ్రామాల ప‌రిస్థితి కాంగ్రెస్ రాజ్యంలో ఎలా ఉండే. ప‌ట్ట‌ణాల ప‌రిస్థితి అప్పుడు ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల ఉండే.. ఎన్ని మార్పులు వ‌చ్చిన‌య్.. అవ‌న్నీ మీ కండ్ల ముందే ఉన్నాయి. అభివృద్ధి ప‌నులు మీ గ్రామంలో మీ ప‌ట్ట‌ణంలోనే ఉన్నాయి. వైరా గ్రామ‌పంచాయ‌తీగా ఉండే. దీన్ని మున్సిపాలిటీ చేసుకుని బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇవాళ‌ సెంట్ర‌ల్ లైటింగ్ కానీ, డివైడ‌ర్స్ కానీ, రోడ్ల విస్త‌ర‌ణ కానీ అద్భుతంగా జ‌రుగుతుంది. ఇది మీ కండ్ల ముంద‌ర్నే ఉంద‌ని తెలియ‌జేస్తున్నా.

కాంగ్రెస్ రాజ్యంలో చాలా క‌రువుతో అవ‌స్థ‌లు ప‌డ్డాం. భ‌యంక‌ర‌మైన క‌రువు. జూలూరుపాడు, ఏన్కూరు, కారేప‌ల్లి మండ‌లాల్లో క‌రువు ఉండే. చాలా భ‌యంక‌ర‌మైన‌ క‌రువు. ఇవ‌న్నీ కూడా కాంగ్రెస్ పుణ్య‌మే. తెలంగాణ వ‌చ్చిన‌నాడు క‌రెంట్ లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు స‌రిగా రావు, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, చేనేత కార్మికుల ఆక‌లి చావులు, ప్ర‌జ‌లు వ‌ల‌స పోయిన ప‌రిస్థితి. చాలా భ‌యంక‌రంగా ఉండేది. ఒక‌టి ఒక‌టి బాగు చేసుకుంటూ వ‌చ్చాం. మీరంద‌రూ కూడ చూస్తున్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ ప‌రిపాల‌న‌లో ఎట్ల ఉండే. ఈ ప‌దేండ్ల పాలన‌ ఎలా ఉందో బేరిజు వేసి గ‌మ‌నించి, ఓటు వేయాలి.

పోడు భూముల పంపిణీ విష‌యానికి వ‌స్తే 3650 కుటుంబాల‌కు 7140 ఎక‌రాల భూముల‌కు ప‌ట్టాలు ఇచ్చాం. మునుప‌టి లాగా ప‌ట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోలేదు. వెంట‌నే దానికి రైతుబంధు పెట్టినం. క‌రెంట్ మంజూరు చేస్తున్నాం. పోడు భూముల పంచాయితీల్లో ఉన్న కేసుల‌న్నీ ఎత్తేసినం. అవ‌న్నీ మీ కండ్ల ముంద‌ర‌నే ఉన్నాయి. మా తండాలో మా రాజ్యం ఇది గిరిజ‌న బిడ్డ‌ల నినాదం.

50 ఏండ్ల కాంగ్రెస్‌లో ఏనాడూ ఖాత‌రు కూడా చేయ‌లేదు. కానీ ఈరోజు 3500 లంబాడీ తండాలు, ఆదివాసీ గూడెంలు, కోయ‌గూడెంల‌ను జీపీలుగా మార్చాం. వైరా నియోజ‌క‌వ‌ర్గంలో కూడా 45 తండాలు గ్రామ‌పంచాయ‌తీలుగా అయ్యాయి. వాళ్ల తండాల్లో వారే ప‌రిపాల‌న చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇదంతా క‌థ కాదు.. జ‌రిగిన కార్య‌క్ర‌మాలు చెబుతున్నాను.

కాంగ్రెస్‌కు అధికారం వ‌స్తే ఇందిర‌మ్మ రాజ్యం తెస్త‌మ‌ని చెబుతున్నారు. ఎందుకు ఆ దిక్కుమాలిన ప‌రిసాల‌న‌. ఏం ఉద్ధ‌రించారు అని, ఆనాడు ఎవ్వ‌ళ్లు బాగుప‌డ్డార‌ని, అంతా అరాచ‌కాలు, పేదోళ్లు పేదోళ్ల‌గానే ఉండిపోయారు. ఎస్టీలు, ఎస్సీల‌ను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఏం చేయ‌లేదు. చేస్తే ద‌ళిత, గిరిజ‌నుల ప‌రిస్థితి ఇట్ల ఉండేది కాదు.

స్వాతంత్ర్యం వ‌చ్చిన నాడే వారు ఆలోచించి ఉంటే ఈపాటికి ద‌ళిత, గిరిజ‌న వ‌ర్గాలు బాగుప‌డాలి. కానీ జ‌ర‌గ‌లేదు. ఇందిర‌మ్మ పాల‌న‌లోనే ఎమ‌ర్జెన్సీ వ‌చ్చింది. ప్ర‌తిప‌క్షాల‌ను ప‌ట్టుకుపోయి జైల్లో వేసి చాలా దుర్మార్గ‌మైన చీక‌టి రోజులు తెచ్చారు. మ‌ళ్లా ఆ ద‌రిద్రం పాల‌న మ‌న‌కెందుకు అవ‌స‌ర‌మే లేదు. బీఆర్ఎస్ వ‌చ్చిన త‌ర్వాత స‌మీక్ష‌లు జ‌రిపి ఒక దారి ప‌ట్టాం. పేద‌ల సంక్షేమం చేశాం.

గోదావ‌రి ద‌గ్గ‌ర ఉన్న‌ప్ప‌టికీ మంచినీళ్లు ఇవ్వ‌డం చేత‌కాలేదు కాంగ్రెస్ పార్టీకి. అసెంబ్లీలో నేను చెప్పాను.. ఐదేండ్ల‌లో మిష‌న్ భ‌గీర‌థ కంప్లీట్ చేసి ప్ర‌తి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మేం నిల‌బ‌డం, ఓట్లు అడ‌గం అని చెప్పినం. ఛాలెంజ్ చేసి, వెంబ‌డిప‌డి, ప‌ట్టువ‌ట్టి దాన్ని తీసుకొచ్చి మీకు అప్ప‌గించినం. మీ కండ్ల ముంద‌ర ఉన్నాయి. ఇవాళ మంచినీటి బాధ‌లు తీరాయి.

మ‌ద‌న్‌లాల్ కొన్ని కోరిక‌లు కోరారు. అవ‌న్నీ కూడా చేయ‌ద‌గిన‌టువంటి ప‌నులే. ఢిల్లీ నుంచి వ‌చ్చేటివి కావు. మ‌న చేతిలో ఉండేటేవి. వైరా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల ప‌క్షాన ఆయ‌న కోరిన ప‌నులు నేను చేయిస్తా. ఆయ‌న సౌమ్యుడు, మంచివాడు. రాములు నాయ‌క్ చాలా గొప్ప మ‌నిషి. నేను రెక్వెస్ట్ చేసి ఈసారి మ‌ద‌న్‌లాల్‌కు అవ‌కాశం ఇవ్వ‌మంటే ఆయ‌న కూడా పెద్ద మ‌న‌సుతో స‌హ‌క‌రించి, ఏ మాత్రం విబేధించ‌కుండా రాములు నాయ‌క్ స‌హృద‌యంతో ప‌ని చేస్తున్నారు. రాములు నాయ‌క్ స‌ముచిత‌మైన గౌర‌వంలో ఉంటారు. బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీ తీసుకురావాలి అని కేసీఆర్ కోరారు.

కొంత‌మంది ఇక్క‌డున్న‌ అహంకారులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్న‌రు. వాళ్ల నోట్ల క‌ట్ట‌లు హైద‌రాబాద్‌లో దొరుకుతున్న‌య్. వాళ్లు ఏం మాట్లాడుతారు.. డ‌బ్బు అహంకారంతోని బీఆర్ఎస్ పార్టీవోని అసెంబ్లీ గ‌డ‌ప తొక్క‌నీయం అంట‌రు. అసెంబ్లీ క‌డ‌ప తొక్క‌నీయ‌క‌పోవ‌డానికి వీడెవ‌డు..? నాకు అర్థం కాదు. అసెంబ్లీకి ఎవ‌ర్నీ పంపాలో నిర్ణ‌యించేది మీరు క‌దా..? ఆ ఓటు మీ ద‌గ్గ‌ర ఉంది క‌దా..? అందుకే ఈ నోట్ల క‌ట్ట‌ల ఆసాముల‌కు.. కోట్ల విలువైన మీ ఓటుతోనే గుద్ది బుద్ది చెప్పాలి.

ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు నాకు చెప్పారు. వైరా రిజ‌ర్వాయ‌ర్‌లో నీళ్లు ఎండిపోతున్నాయి. పంట‌లకు నీళ్లు అవ‌స‌రం ఉన్నాయి. వెంట‌నే విడిపించాల‌ని అన్నారు. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో అయితే ఇచ్చేవారా..? నెత్తి కొట్టుకున్న ఇవ్వ‌క‌పోదురు. మొన్న మీరు అడిగారు.. చిటికె లోప‌ల నీళ్లు వ‌చ్చాయి. ఫుల్‌గా నీళ్ల‌తో వైరా ప్రాజెక్టును నింపేశాం. ఇది కాంగ్రెస్ రాజ్యంలో సాధ్య‌మ‌య్యేదా..? మ‌న రాజ్యం ఉంది కాబ‌ట్టి మ‌న ప్ర‌జ‌ల కోసం ఏదైనా చేయాల‌ని తండ్లాడుతున్నాం. సీతారామ ప్రాజెక్టు 70 శాతం క‌ప్లీట్ అయింది. 30 శాతం ప‌నులు మిగిలి ఉన్నాయి. ఇంకో మాట మీరు ఆలోచించాలి.

ఇంత పొడ‌వు గోదావ‌రి ఖ‌మ్మం జిల్లాను ఒరుసుకుంటూ పారుత‌ది. మ‌రి ఒక్క ముఖ్య‌మంత్ర‌న్నా.. ఒక్క మంత్ర‌న్న‌.. ఇవాళ కూడా ఒక మాజీ మంత్రి బాగా న‌రుక్కుతున్న‌డు క‌దా..? ఈ నరికినోళ్లు గోదావ‌రి నీళ్లు తెచ్చుకోవాల‌ని ఎందుకు ఆలోచ‌న చేయ‌లేదు. వాళ్ల‌కు క‌డుపునొప్పి ఉండేనా..? ఇది మ‌న రాష్ట్రం.. మ‌న‌కు క‌డుపునొప్పి ఉంట‌ది కాబ‌ట్టి గోదావ‌రి ఒరుసుకుంటూ పారే జిల్లాలో జూలూరుపాడు, కారేప‌ల్లి, ఏన్కూరు, ఇల్లెందులో క‌రువు ఎందుకు ఉండాల‌ని సీతారామ ప్రాజెక్టు క‌డుతున్నాం.

అది కంప్లీట్ అయితే వైరాతో పాటు మ‌రిన్ని ప్రాంతాలు 365 రోజులు నిండే ఉంటాయి. పంట‌ల‌కు డోఖా ఉండ‌దు. ఆ ప్రాజెక్టు అయిపోతే 40 వేల ఎక‌రాల‌కు నీళ్లు వ‌స్తాయి. చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఎత్తైన ప్రాంతాల‌కు నీళ్లు పారుతాయి. చాలా స‌స్య‌శ్యామ‌లంగా, పాత ఖ‌మ్మం జిల్లా వ‌జ్ర‌పు, బంగార‌పు తున‌క‌లా త‌యార‌వుతుంది. అది కేసీఆర్ క‌ల‌. బ్ర‌హ్మాండంగా మ‌నం ముందుకు పోదాం. క‌చ్చితంగా మ‌ద‌న్‌లాల్‌ను గెలిపించండి. మీ కోరిక‌ల‌న్నీ నెర‌వేర్చే బాధ్య‌త నాది.

Updated On
Somu

Somu

Next Story