ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం, హామీలు ఇవ్వడం సహజమే. ఈసారి రాష్ట్రంలో ఎన్నికలతో పాటు పథకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

విధాత : ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం, హామీలు ఇవ్వడం సహజమే. ఈసారి రాష్ట్రంలో ఎన్నికలతో పాటు పథకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మా పథకాలను కాపీ కొట్టారు అంటే మా పథకాలనే మీరు కొట్టారని ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ బీఆర్‌ఎస్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, మళ్లీ అవకాశం ఇస్తే ఏం చేస్తామో చెబుతున్న హామీల కంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీపై చర్చ జరుగుతున్నది. చాలామంది ఓటర్లను ఆలోచనలో పడేసింది. బీఆర్‌ఎస్ అవి అసాధ్యమని ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం వీటిపట్ల ఆకర్షితులవుతున్నట్టు సమాచారం. అయితే ఇవి ఎంత వరకు ఓట్లను రాబడుతాయి అనే విషయాన్ని పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా విడుదల చేసిన మ్యానిఫెస్టో పేర్కొన్న హామీలు కూడా అధికారపార్టీకి కొంత ఇబ్బంది కలిగించేవేనని అంటున్నారు.
బీఆర్‌ఎస్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను 2014 ఎన్నికల సమయంలో చాలా అమలు చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొనని వాటిని కూడా అమలు చేసింది. కానీ వాగ్దానం చేసి విస్మరించినవే ప్రస్తుతం ఆ పార్టీకి అనేక చిక్కులు తెచ్చిపెడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం జరగుతున్నది అన్నవే ప్రచారాస్త్రాలుగా చేసుకున్నది. పదేళ్లలో అధికారపార్టీ విస్మరించిన వాటినే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుండటం ఆ పార్టీకి కలిసి వస్తుంది అంటున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగాలను, ఉపాధి అకాశాలను పక్కనపెట్టి చాలామంది పోరాడారు. జేఏసీలు ఏర్పడి ఆయా జిల్లాల్లో, పట్టణాల్లో క్రియాశీలంగా పనిచేసిన వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారు. కొంతమందిపై ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాళ్లంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పించినా చాలామందిలో అసంతృప్తి అ అలాగే ఉన్నది. త్యాగాలు చేసిన మాకు న్యాయం జరగలేదని వారూ ఇప్పటికీ వాపోతున్నారు. అందుకే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు నెలవారీ రూ.25 వేల పింఛన్, ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామనడం, వాళ్లకు 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామనడం వారికి చాలా ఊరట కలిగించే అంశాలు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నియామకాల్లో నిర్లక్ష్యం చూపిందనేది వాస్తవం. దీనికితోడు ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష రద్దు వంటివి ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. అందుకే మంత్రి కేటీఆర్ మొదట్లో దీనిపై దబాయించే ప్రయత్నం చేశారు. కానీ గ్రౌండ్ లెవల్లో నిరుద్యోగులు చాలా వ్యతిరేకంగా ఉన్నారని, వారి కుటుంబ సభ్యులు కూడా ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారనే తెలిసింది. అందుకేవారిని ప్రసన్నం చేసుకోవడానికి, వారికి భరోసా ఇవ్వడానికి ఈసారి అధికారంలోకి వచ్చాక సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని, నియామకాలు పారదర్శకంగా భర్తీ చేస్తామని చెప్పుకోవాల్సి వస్తున్నది. అయితే అది ఎంత వరకు ఫలిస్తుందో చెప్పలేని స్థితి నెలకొన్నది.
వార్షిక జాబ్ క్యాలెండర్ కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదు. అంతేకాదు గత ఏడాది అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అలాగే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీకూడా అమలుకు నోచుకోలేదు. దీంతో ప్రభుత్వాన్ని నిరుద్యోగులు విశ్వసించే పరిస్థితులు కనిపించడం లేదనే చెప్పాలి. అందుకే నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ తప్పకుండా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు.
ఇక రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ, రైతులకు రూ. 3 లక్షల వడ్డీ లేని రుణాల వంటివి హామీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు నమ్మితే కేసీఆర్ ప్రభుత్వానికి మరిన్నికష్టాలు తప్పకపోవచ్చు. అలాగే ధరణి వల్ల రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నది. ఇందులోని లోపాలను చాలామంది నిపుణులు కూడా చెబుతున్నారు. సవరించాల్సిన విషయాలు చెబుతన్నారు. కానీ సవరిస్తామని సీఎం హామీ ఇవ్వడం లేదు. పైగా కాంగ్రెస్ వస్తే ధరణి పోతుంది. రైతుబంధు, రైతు బీమా ఆగిపోతుందని విమర్శిస్తున్నారు. రైతుబంధు, రైతు బీమాకు ధరణికి సంబంధం లేదు.
ప్రభుత్వం తాను చేసిన తప్పులను అంగీకరించి అవకాశం ఇస్తే సవరించుకుంటామంటే ప్రజలు ఆలోచిస్తారు. కానీ అసలు సమస్యలే లేనట్లు, ఆ పోర్టల్ అద్భుతం అన్నట్టు సీఎం ప్రచారం చేయడం పట్ల రైతులు ఎలా వ్యవహరిస్తారన్నది చూడాలి. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లికి కళ్యాణలక్ష్మీ- షాదీముబారక్ పేరుతో రూ. 1లక్ష అందిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ లక్ష తోపాటు 10 గ్రాముల బంగారం ఇస్తామంటున్న హామీ పట్ల కూడా ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా ఇచ్చిన హామీలను కొన్నింటిని అధికారపార్టీ గత రెండు ఎన్నికల సందర్భంగా ప్రజలు వాగ్దానం చేసినా విస్మరించింది. అంతేకాదు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరించింది. అందుకే వాస్తవాలను విస్మరిస్తే అవి మరోరూపంలో ముందుకు వస్తాయని, అవే అధికారపార్టీకి ఇబ్బందిగా మారబోతాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి.
