Harish Rao
విధాత బ్యూరో, కరీంనగర్: కమ్యూనిస్టు పార్టీలకు కార్యకర్తలు లేరని సీపీఐ, సీపీఎం పార్టీల మాయలో పడొద్దని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టులకు కోపం తెప్పించాయి. మంత్రి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని, ఆయన మతిభ్రమించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి విమర్శించారు. అహంకార పూరిత వ్యాఖ్యలు చేసే ముందు ఒక్కసారి వెనక్కు తిరిగి ఆలోచించాలని ఆయనకు హితవు చెప్పారు. మునుగోడులో కమ్యూనిస్టులు లేకుండా బీఆరెస్ విజయాన్ని ఊహించలేమని సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. సీపీఐ, సీపీఎం కార్యకర్తల బలమెంతో రానున్న రోజుల్లో హరీష్ రావు కు తెలుస్తుందని మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో మండి పడ్డారు.
‘మీలాగా అధికారం కోసం వెంపర్లాడే పార్టీలు సీపీఐ, సీపీఎం కాదంటూ మంత్రి వ్యాఖ్యలకు ఆయన దీటుగా బదులిచ్చారు. కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై, వారి హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేపడుతూ సీపీఐ, సీపీఎం వారికి అండగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు .బీఆరెస్ మాదిరిగా కార్యకర్తలు,నాయకులకు పదవులు, డబ్బు ఆశ చూపే పార్టీలు తమవి కావన్నారు. ఓట్ల కోసం,సీట్ల కోసం,అధికారం కోసం వెంపర్లాడే బీఆరెస్ నేతలకు తమను విమర్శించే హక్కు లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో బీఆరెస్ పార్టీకి ఎంత మంది కార్యకర్తలు ఉన్నారో అందరికి తెలిసిందేనన్నారు. అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలే కాదు దేశంలోని అనేక రంగాల్లో పనిచేసే కార్మికులు కమ్యూనిస్టు పార్టీల వైపు ఉంటారని, ఈ విషయం తెలియక పోతే చరిత్ర తెలుసుకోవాలని అంతే తప్ప సీపీఐ, సీపీఎం పార్టీలకు కార్యకర్తలు లేరని చులకనగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే వారు లేరని గుర్తుంచుకోవాలన్నారు. తమ బలమేంటో రానున్న రోజుల్లో చూపిస్తామన్నారు. కమ్యూనిస్టుల గురించి మీలాగా మాట్లాడిన వారు అనేక మంది కాలగర్భంలో కలిసి పోయారని చెప్పారు. మరొక్కసారి సీపీఐ, సీపీఎం గురించి తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని వెంకటస్వామి హెచ్చరించారు.