అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు 4 నెలల్లోగా పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

విధాత, హైదరాబాద్: సాగు సాగక నష్టం వచ్చి అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు 4 నెలల్లోగా పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్ జిల్లాల్లో పిటిషనర్ పేర్కొన్న రైతుల వివరాలపై విచారణ జరిపి.. అర్హులైన వారిని గుర్తించి, సాయం అందజేయాలని స్పష్టం చేసింది. రైతు ఆత్మహత్యలపై కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.6 లక్షల పరిహారం అందజేయడం లేదంటూ బన్నూరు కొండల్‌రెడ్డి, నల్ల సూర్యప్రకాశ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రైతు ఆత్మహత్యలకు సంబంధించి 100 మందికిపైగా అభియోగ పత్రాలను పోలీసులు దాఖలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదించారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చినా అర్హులైన రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదని చెప్పారు. పరిహారం పంపిణీకి సిఫార్సు చేయాల్సిన కమిటీల నియామకంపై అలసత్వం వహిస్తోందన్నారు. అయితే ప్రతి జిల్లాలోనూ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆర్డీవో, వ్యవసాయ శాఖ డైరెక్టర్, డీఎస్పీ స్థాయి అధికారి ఈ కమిటీలో ఉంటారన్నారు. గడువిస్తే.. కమిటీలు పేర్కొన్న వారికి పరిహారం అందజేస్తామని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కమిటీలు పూర్తిస్థాయిలో విచారణ చేసిన అర్హుల పేర్లు సిఫార్సు చేయాలని, ఆ మేరకు ప్రభుత్వం 4 నెలల్లో పరిహారం పంపిణీ చేయాలని ఆదేశించింది. పిటిషన్లలో వాదనలను ముగించింది.
