- మూడు కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి విడుదల
- ఉత్పత్తులను ప్రారంభించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ప్రతిష్టాత్మకమైన జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ ప్రాజెక్టుకు ఎంపికైంది. సోమవారం డైరీలో జరిగిన నూతన ఉత్పత్తుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
జైకా ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ డెయిరీకి 90.70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం సమకూరనుంది.
ఇందులో 12.46 కోట్లు గ్రాంట్ కాగా, 71.52 కోట్లు రుణ మొత్తాన్ని 1.5 శాతం వడ్డీతో నిధులు విడుదలైన నాటినుండి పది సంవత్సరాల వ్యవధిలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ భవనాలు, పాల పరీక్షలకు సంబంధించిన యంత్రాలు, పాల క్యాన్లు, పాల సేకరణ యూనిట్లు, తదితర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తొలుత ఈ ప్రాజెక్టును నిర్ణయించగా, అనంతరం మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్ ,తెలంగాణ రాష్ట్రాలకు విస్తరించారు.
పాల ఉత్పత్తిదారుల సంఖ్యను, ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకొని తెలంగాణలో నెంబర్ వన్ డెయిరీగా ఎదిగిన కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ జికా పథకం ద్వారా మరింత విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది.
ఇప్పటికే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామం వద్ద 100 కోట్ల ఖర్చుతో అధునాతన డెయిరీని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ నిర్మించింది. త్వరలో ఇది ప్రారంభోత్సవానికి నోచుకోబోతున్నది.
ఇదిలా ఉండగా ఇప్పటికే అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చిన కరీంనగర్ డైరీ తాజాగా 16 రకాల ఐస్ క్రీములు, ఉస్మానియా బిస్కెట్స్, టోన్డ్ మిల్క్ పెరుగు, డబుల్ టోన్డ్ మిల్క్ పెరుగు మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. ఈ కార్యక్రమంలో డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు, పాలకవర్గం ఇతర సిబ్బంది పాల్గొన్నారు.