చెన్నూరు కాంగ్రెస్ అభ్య‌ర్థి, మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయ‌న ఇండ్లు, కార్యాల‌యాల వ‌ద్ద‌కు తెల్ల‌వారుజామునే ఐటీ అధికారులు చేరుకున్నారు.

తెలంగాణలో మళ్లీ ఐటీ దాడులు

మాజీ ఎంపీ వివేక్, వినోద్‌ల ఇళ్లలో సోదాలు

సిర్పూర్‌ బీఆరెస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప అనుచరుల ఇళ్లలో సోదాలు

జిన్నింగ్‌ మిల్లులలో తనిఖీలు

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ, ఈడీ దాడుల పరంపర కొనసాగుతుంది. మంగళవారం మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి, బెల్లంపల్లి అభ్యర్థి గడ్డం వినోద్ల ఇండ్లు, కార్యలయాలలో తనిఖీలు నిర్వహించారు. వివేక్ వెంకటస్వామి, వినోద్‌ల ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని వారి నివాసాలతో పాటు బేగంపేటలోని వివేక్ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి.


సోమాజిగూడలోని నివాసంలో 4 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. ఇటీవల వివేక్ సంస్థల్లోకి రూ.8కోట్లు చేరాయనే అంశంపై సదరు నగదును ఫ్రీజ్‌ చేసిన అధికారులు ఈ వివాదంపై తాజా తనిఖీలు చేపట్టారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూర్‌ బీఆరెస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ సైతం తాజాగా వివేక్‌ తన కంపనీల ద్వారా నగదు బదిలీలు చేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివేక, వినోద్‌లపై ఐటీ దాడులను నిరసిస్తూ చెన్నూరు, బేగంపేట్‌, బెల్లంపల్లిలలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనలకు దిగాయి.

మరోవైపు జనగామ జిల్లాలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. రఘునాథపల్లి మండలంలోని సిరి కాటన్ జిన్నింగ్‌ మిల్లులలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక సిర్పూర్ బీఆరెస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప అనుచరుల ఇండ్‌ళ్లలో సైతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బీఆరెస్‌ నేత కాసం శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడలో మహేశ్వరి జిన్నింగ్‌ మిల్లులో, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జిన్నింగ్‌ మిల్లులోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Updated On 21 Nov 2023 11:38 AM GMT
Somu

Somu

Next Story