- పదేళ్లలో భాస్కర్ రావు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి

- కౌన్సిలర్ గా పనికి రానోడు ఎమ్మెల్యేగా ఏం చేస్తాడు

- సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడలో ఎర్రజెండా ఎగరడం ఖాయమని సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మిర్యాలగూడలో ఎన్నికలు ధన బలం, ప్రజాబలం మధ్య పోరాటం జరుగుతున్నదని, అందులో ప్రజాబలం ఉన్న సీపీఎం అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైందన్నారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న భాస్కర్ రావు నియోజవర్గ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కౌన్సిలర్ గా పనికిరాని వాడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తాడో మీరే అర్థం చేసుకోవాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పెట్టుబడి పెడుతున్నారని, గెలిచాక పదింతలు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ అభ్యర్థి తాను చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈపదేళ్ల కాలంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. డబ్బు ఉందని అహంకారంతో ఓట్లను కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు స్థానిక ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆరోపించారు. సేవ ముసుగులో రాజకీయం చేస్తూ పల్నాడు రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం మద్దతుతో పట్టణంలో రవీంద్ర నగర్ కౌన్సిలర్ గా గెలిపిస్తే ఆ వార్డును ఇప్పటివరకు చూసిన దాఖలాలు లేవని, కనీస సౌకర్యాలు తీర్చ లేదన్నారు.


కౌన్సిలర్ ఎన్నికల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి ఆ వార్డు ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు సేవా ముసుగులో ఎమ్మెల్యే కావాలని చూస్తున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అసెంబ్లీలో చివరి బెంచ్ లో కూర్చుంటారని, కనీసం సమస్యలను ప్రస్తావించేందుకు కూడా అవకాశం దొరకదని చెప్పారు. అదే తనను గెలిపించినట్లైతే ముందు సీట్లో కూర్చుంటానని, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజా సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుండి రంగన్నకు విశేష ఆదరణ లభిస్తున్నదన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రంగన్నకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి పరశురాములు, పగిడోజు రామ్మూర్తి, దేశి రామ్ నాయక్ పాల్గొన్నారు.

Updated On
Subbu

Subbu

Next Story