యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి కొండపైకి ఆటోలు నడిపించేందుకు తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 3నుంచి అనుమతిస్తామని, ఆటో కార్మికులు ఆందోళన చెందవద్దని నేను మాట ఇస్తున్నానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి కొండపైకి ఆటోలు నడిపించేందుకు తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 3నుంచి అనుమతిస్తామని, ఆటో కార్మికులు ఆందోళన చెందవద్దని నేను మాట ఇస్తున్నానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సోమవారం ఆలేరు నియోజకవర్గం బీఆరెస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గెలుపు కోసం యాదగిరిగుట్టలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
ఆలేరులో సునితక్క గెలుచుడు పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయం అద్భుతంగా నిర్మాణం జరిగిందని, 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండేనో ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలన్నారు. ఓవైసీ కూడా యాదాద్రి ఆలయం అద్భుతంగా ఉందన్నారన్నారు. ఆలేరు నియోజకవర్గానికి కాళేశ్వరం బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల ద్వారా గోదావరి నీళ్లందిస్తున్నామని, కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇంటింటికి అందుతున్నాయన్నారు. ఎన్నికల్లో మరోసారి బీఆరెస్‌ను ఆశీర్వదించాలన్నారు.
కాగా ఇదే రోజు మానకొండూరు ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఫిట్‌నెస్, సర్టిఫికెట్ జారీ చార్జీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఏటా 12వేల ఆర్ధిక సహాయం ప్రకటించిన నేపధ్యంలో ఆటో డ్రైవర్లను ఆకర్షించేందుకు కేసీఆర్, కేటీఆర్‌లు ఇద్దరు ఒకే రోజు ఆటోడ్రైవర్లకు హామీలిచ్చారని, కేసీఆర్ హామీలన్ని కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టినట్లుగానే సాగుతున్నాయని కాంగ్రెస్ చెబుతుంది.
