- 55 ఏళ్లు పరిపాలించి.. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు

- వలిగొండలో ఇవ్వి అడిగితే వీపు పగులకొట్టి పంపించాలే

- 30వ తారీకు నాడు ఎవడు అడ్డం వచ్చిన తొక్కుకుంటూ పోవుడే

- యాదగిరిగుట్ట, వలిగొండ, మిర్యాలగూడలో రోడ్ షో

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ‘యాదాద్రి జిల్లాను చేసి అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నది కేసీఆర్ కాదా? 55 ఏళ్లు అధికారంలో ఉన్న చెత్తనా కొడుకులతో ఏం అభివృద్ధి జరిగింది' అని కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి బీఆరెస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు కోరుతూ సోమవారం వలిగొండలో నిర్వహించిన రోడ్ షొలో విపక్ష నేతలను మంత్రి కేటీఆర్ బండ బూతులు తిట్టారు. భువనగిరిలో శేఖర్ రెడ్డిని గెలిపిస్తే మిగిలిపోయిన పనులన్నీ జరుపుకొని యాదాద్రిని సస్యశ్యామలం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎక్కడ? ఇంటికో ఉద్యోగం ఎక్కడా? కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడా? అంటూ కొందరు వ్యక్తులు రోడ్ షోలో ప్రకార్డులు ప్రదర్శించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఆ సన్నాసులు అడుగుతున్నారు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని, 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఏం పీకారు. ఇజ్జత్ మానం లేదు అడగటానికి, 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఇవాళ వచ్చి ఇది లేకపాయే.. అది లేకపాయే అంటే వీపు పగుల కొట్టే వాళ్లు లేకనా... మీ యాదాద్రిని జిల్లా చేసింది ఎవరు..? కేసీఆరేనా.. మరి చెత్త నా కొడుకులకు అయిందా 55 ఏళ్లలా. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. 55 ఏళ్లలా కరెంట్ ఇచ్చిన కొడుకులా వీళ్లు.. తాగునీళ్లు ఇచ్చిర్రా. సాగు నీరు ఇచ్చిరా, రైతుబంధు ఇచ్చిర్రా, కేసీఆర్ కిట్టిచ్చిర్రా, డిగ్రీ కాలేజ్ తెచ్చిర్రా. వలిగొండలో ఇవ్వి అడిగితే వీపు పగులకొట్టి పంపించాలే. 30వ తారీకు నాడు ఎవడు అడ్డం వచ్చిన తొక్కుకుంటూ పోవుడే’ అంటూ కేటీఆర్ తీవ్ర అసహనంతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి తీవ్ర పదజాలాన్ని వాడారు. కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాంగ్రెస్ వెధవలకు కనీసం బుద్ధుందా?

మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తుంటే బీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు. ‘2014 ముందుకు మిర్యాలగూడ ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుంది.. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎంత ఘోరంగా ఉండేది? రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరెంటు కనబడత లేదంట కాంగ్రెస్ వెధవలకు కనీసం బుద్ధుందా? 11సార్లు వాళ్లకు అధికారం ఇచ్చిన ఏ మాత్రం అభివృద్ధి చేయని సన్నాసులు కాంగ్రెస్ వాళ్లు.. సెల్ ఫోన్లలో టింగు టింగు మంటు రైతుబంధు పడుతుందా? పడట్లేదా? సన్నాసుల చేతిలో, ఎదవల చేతుల్లో పెడదామా ఈ రాష్ట్రాన్ని? ధరణి రద్దు చేస్తాం, గ్రామాలలో పట్వారి వ్యవస్థను తీసుకొస్తా అంటున్నాడు బట్టి విక్రమార్క.


మిర్యాలగూడ కళకళలాడుతుందంటే ఇక్కడ వ్యవసాయం బాగున్నట్టే కదా? ఈ రాష్ట్రంలో హిందువైనా, క్రిస్టియన్ అయినా సిక్కు అయిన అందరం అన్నదమ్ముల వల్ల కలిసిఉన్నం. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత భాస్కరరావు ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్త పథకాలను పెడతాం. దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి మోడీని అందరూ పిరమైన ప్రధాని అంటున్నారు. భారతదేశానికి అన్నం పెట్టే విధంగా ఎదిగింది మన తెలంగాణ. నల్గొండ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా అయింది. ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలను కట్టిస్తాం. దామరచర్లలో 30 వేల కోట్లతో పవర్ ప్లాంట్ ను కడుతున్నాం.. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? ఇవన్నీ జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి కొండపైకి ఆటోలు నడిపించేందుకు తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 3 నుంచి అనుమతిస్తామని, ఆటో కార్మికులు ఆందోళన చెందవద్దని నేను మాట ఇస్తున్నానని ప్రకటించారు.

సునితక్క గెలుచుడు పక్కా

ఆలేరులో సునితక్క గెలుచుడు పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయం అద్భుతంగా నిర్మాణం జరిగిందని, 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండేనో.. ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలన్నారు. ఓవైసీ కూడా యాదాద్రి ఆలయం అద్భుతంగా ఉందన్నారన్నారు. ఆలేరు నియోజకవర్గానికి కాళేశ్వరం, బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల ద్వారా గోదావరి నీళ్లందిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇంటింటికి అందుతున్నాయన్నారు. ఎన్నికల్లో మరోసారి బీఆరెస్‌ను ఆశీర్వదించాలని కేటీఆర్ కోరారు.

Updated On
Subbu

Subbu

Next Story