మున్సిపాలిటీ పాల‌క‌వ‌ర్గాల కాల‌వ్య‌వ‌ధి మూడేండ్లు పూర్త‌యినందున‌.. మారుతున్న స‌మీకర‌ణాలు విధాత‌: నేటితో.. (జ‌న‌వ‌రి 27) రాష్ట్రంలోని మున్సిప‌ల్ పాల‌క వ‌ర్గాల‌కు మూడేండ్లు పూర్త‌య్యింది. ఈ నేప‌థ్యంలో.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల‌న్నింటిలో అవిశ్వాస తీర్మాన అల‌జ‌డి మొద‌లైంది. రాష్ట్ర మున్సిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం… మున్సిపాలిటీ పాల‌క వ‌ర్గంలో అవిశ్వాస తీర్మానానికి కాల‌వ్య‌వ‌ధి మూడేండ్లు. ఏ కార‌ణం చేత‌నైనా అవిశ్వాసం ప్ర‌వేశ పెట్టాలంటే.. కాల‌వ్య‌వ‌ధి మూడేండ్లు పూర్త‌వ్వాలి. ఇన్నాళ్లూ దీని కోస‌మే ఎదురు చూస్తున్న అస‌మ్మ‌తివాదులు, చైర్మ‌న్ ప‌ద‌విపై ఆశ‌పెట్టుకున్న ఆశావాదులు […]

మున్సిపాలిటీ పాల‌క‌వ‌ర్గాల కాల‌వ్య‌వ‌ధి మూడేండ్లు పూర్త‌యినందున‌.. మారుతున్న స‌మీకర‌ణాలు

విధాత‌: నేటితో.. (జ‌న‌వ‌రి 27) రాష్ట్రంలోని మున్సిప‌ల్ పాల‌క వ‌ర్గాల‌కు మూడేండ్లు పూర్త‌య్యింది. ఈ నేప‌థ్యంలో.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల‌న్నింటిలో అవిశ్వాస తీర్మాన అల‌జ‌డి మొద‌లైంది. రాష్ట్ర మున్సిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం… మున్సిపాలిటీ పాల‌క వ‌ర్గంలో అవిశ్వాస తీర్మానానికి కాల‌వ్య‌వ‌ధి మూడేండ్లు. ఏ కార‌ణం చేత‌నైనా అవిశ్వాసం ప్ర‌వేశ పెట్టాలంటే.. కాల‌వ్య‌వ‌ధి మూడేండ్లు పూర్త‌వ్వాలి. ఇన్నాళ్లూ దీని కోస‌మే ఎదురు చూస్తున్న అస‌మ్మ‌తివాదులు, చైర్మ‌న్ ప‌ద‌విపై ఆశ‌పెట్టుకున్న ఆశావాదులు ఇప్పుడు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

జ‌గిత్యాల మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ బోగా శ్రావ‌ణి స్థానిక ఎమ్మెల్యే అధిప‌త్య‌ధోర‌ణి, వేధింపులు తాళ‌లేక రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలో ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే వేధింపుల‌ను చెప్తూ క‌న్నీరుమున్నీర‌య్యారు. అయితే.. చైర్‌ప‌ర్స‌న్ ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా.. ఈ వ్య‌వ‌హారం వెనుక కూడా ఈ మూడేండ్ల కాల వ్య‌వ‌ధి అనేదే ప్ర‌ధానంగా ఉన్న‌ద‌ని అంటున్నారు.

మున్సిపల్ కౌన్సిల్‌లోని కొంద‌రు కౌన్సిల‌ర్లు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్‌కుమార్ అండ‌తో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు తెలిసింది. దీంతో ఎలాగూ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు, స్థానిక ఎమ్మెల్యే అండ లేక‌పోవ‌టం త‌దిత‌ర అంశాలు త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నందున ప‌ద‌వినుంచి దిగిపోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డిన నేప‌థ్యంలోనే శ్రావ‌ణి రాజీనామాకు సిద్ధ‌ప‌డిన‌ట్లు చెప్తున్నారు.

తాజాగా పెద్ద అంబర్‌ పేట నగర పంచాయతీ, తాండూరు మున్సిపాలిటీ, జవహార్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌,లలో కౌన్సిలర్లు, కార్పోరేటర్లు చైర్‌పర్సన్‌లు, మేయర్‌లపై అవిశ్వాస తీర్మానం పెట్టారు.
తాండూరు మున్సిపల్‌ చైర్‌ పర్సప్‌ స్పప్న పరిమిళపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం, టీజేఎస్‌లకు చెందిన 23 మంది కౌన్సిలర్లు సంతకాలతో జిల్లా కలెక్టర్‌ నిఖిలకు అవిశ్వాస తీర్మానం అందజేశారు.

పార్టీలకు అతీతంగా అధికార పార్టీతో సహా అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయడం కొసమెరుపు. అలాగే పెద్ద అంబర్‌ పేట నగర పంచాయతీ చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌లపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చెందిన కౌన్సిలర్లంతా మూకుమ్మడిగా అవిశ్వాస తీర్మానం పెట్టడం విశేషం.

మంత్రి మల్లారెడ్డి సొంత నియోజవర్గంలో ఉన్న జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో మేయర్‌ మేకల కావ్యపై 20 మంది కార్పోరేటర్లు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాసం వ్యక్తం చేస్తూ నోటీస్‌ అందజేశారు. మేయర్‌ ఒంటెద్దు పోకడకు వ్యతిరేకంగా గతంలోనూ తిరుగుబాటుచేసిన కార్పోరేటర్లు సమయం రావడంతో అవిశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇలా అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్లు, కార్పోరేటర్లపై అవిశ్వాసం వ్యక్తం అవుతుండడంతో అధికార పార్టీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. దీంతో తీవ్ర అంతర్మధనంలో పార్టీ నేతలు పడ్డట్లు సమాచారం.

అయితే.. ఈ వ్య‌వ‌హారం వీటికే పరిమితం అయ్యేలా లేదు. జ‌న‌గామా, ఆర్మూర్‌, హుజూరాబాద్ త‌దిత‌ర మున్సిపల్ కౌన్సిళ్ల‌లో కూడా ఇదే ప‌రిస్థితి ఉన్న‌ద‌ని తెలుస్తున్న‌ది. కొన్ని చోట్ల అప్పుడే కౌన్సిల‌ర్ల‌తో క్యాంపులు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్తున్నారు. దీంట్లో అధికార పార్టీ, విప‌క్ష పార్టీలు కూడా పోటా పోటీగా కౌన్సిల‌ర్ల‌తో శిబిరాలు కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల కోలాహ‌లానికి త‌క్ష‌ణ కార‌ణాలే కాదు, ఆరంభంలోనే హామీలు పొందిన విష‌యాలు కూడా ముందుకు వ‌స్తున్నాయి. 2020 జ‌న‌వ‌రి 27న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టిన నాడు.. చైర్మ‌న్ ప‌ద‌వికి పోటీ తీవ్రంగా ఉన్న చోట వంతుల వారీగా అధికారాన్ని పంచుకునే ఒప్పందాలు కూడా జ‌రిగాయి. ఆ మేర‌కు ఆశావ‌హులు ఇప్పుడు ఈ రెండేండ్లు అయినా త‌మ‌కు ప‌ద‌వి ఇవ్వాల‌నే డిమాండ్‌తో అవిశ్వాసానికి స‌న్న‌ద్ధం అవుత‌న్న‌ట్లు తెలుస్తున్న‌ది.

అలాగే.. 2020నాటికి నేటికీ రాష్ట్ర‌రాజ‌కీయంలో, అధికార పార్టీ శ‌క్తి సామ‌ర్థ్యాల్లో చాలా తేడా వ‌చ్చింది. అన్నింటా ఆశావ‌హుల మ‌ధ్య పోటీ పెరిగింది. కాబ‌ట్టి అవ‌కాశం ఉన్న‌ప్పుడే అధికారం పొందేందుకు చాలా చోట్ల ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి.

ఈ ఏడాది చివ‌ర‌లో సాధార‌ణ ఎన్నిక‌లు ఎదుర్కోబోతున్న వేళ‌.. మున్సిపాలిటీల్లో ఈ గొడ‌వ ఏమిట‌ని బీఆర్ ఎస్ అధిష్ఠానం త‌ల‌ప‌ట్టుకంటున్న‌ట్లు తెలుస్తున్న‌ది. వీలైనంత మేర మున్సిపాలిటీల్లో రాజ‌కీయ సంఘ‌ర్ష‌ణ‌ లు ఉండ‌కుండా చూడాల‌ని స్థానిక నాయ‌క‌త్వానికి రాష్ట్ర‌నాయ‌క‌త్వం సూచిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

ఏదేమైనా.. బీఆర్ ఎస్‌కు మున్సిప‌ల్ పాల‌క‌వ‌ర్గ కాల‌వ్య‌వ‌ధి ముప్పు తెచ్చేట్లుగానే క‌నిపిస్తున్న‌ది. అనేక చోట్ల ఇప్ప‌టికే ప్ర‌త్యేక క్యాంపులు, బ‌ల‌స‌మీక‌ర‌ణ‌లు ఊపందుకుంటున్న ప‌రిస్థితులు స్ప‌ష్టంగా క‌నిన‌పిస్తున్నాయి. ఇది… అధికార బీఆర్ ఎస్‌కు ఎంత కాద‌న్నా పెద్ద అవ‌రోధ‌మే అన‌క త‌ప్ప‌దు.

Updated On 29 Jan 2023 2:22 AM GMT
krs

krs

Next Story