Saturday, January 28, 2023
More
  Homehealthకోలరెక్టల్ క్యాన్స‌ర్‌ను నివారించండిలా..!

  కోలరెక్టల్ క్యాన్స‌ర్‌ను నివారించండిలా..!

  విధాత‌: ప్రపంచం నడిచే తీరులో వేగం చాలా పెరిగింది. పెరిగిన వేగం జీవన విధానాన్ని కూడా వేగ వంతం చేసింది. అంతేకాదు ఆ వేగాన్ని అందుకునే క్రమంలో ఒత్తిడి పెరుగుతోంది కూడా. ఫలితంగా రకరకాల ఆరోగ్య సమస్యలు కొన్ని జీవన నాణ్యతను తగ్గిస్తే మరికొన్ని ప్రాణాంతకాలుగా పరిణమిస్తున్నాయి.

  బీపీ, షుగర్, గుండె జబ్బుల నుంచి కొన్ని రకాల క్యాన్సర్ల వరకు ఈ జాబితాలో చేరుతాయి. జీవన శైలిలో లోపాల వల్ల వచ్చే క్యాన్సర్లలో పెద్దపేగు క్యాన్సర్ కూడా ఒకటి. దీనినే కోలరెక్టల్ క్యాన్సర్ అంటారు. ఇది నివారణ సాధ్యమయ్యే క్యాన్పరే అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఒక అధ్యయనం ద్వారా వెల్లడి చేస్తోంది. నివారణ ఎలా సాధ్యమో తెలుసుకుందాం.

  వర్కవుట్ ముఖ్యం..

  నిజానికి తగినంత వర్కవుట్ వల్ల చురుకుగా ఉండడమే కాదు చాలా రకాల వ్యాధులు ద‌రి చేర‌కుండా నివారిస్తుంది కూడా. 2021 లో జరిపిన ఒక అద్యయనం ఈ విషయాన్నిదృవీకరిస్తోంది. ఈ అధ్యయనం మెటా ఎనాల్సిస్ ఆఫ్ సెవరల్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో జరిగింది.

  ఊబకాయం, మధుమేహాన్ని మాత్రమే కాదు క్రమం తప్పని వ్యాయామం కొలెరెక్టల్ క్యాన్స‌ర్‌ని కూడా నివారిస్తుందట. కొలెరెక్టల్ క్యాన్సర్ సోకి కోలుకున్న‌వారు స‌రైన వ్యాయామం చేయ‌డంతో మ‌ళ్లీ వ్యాధి పున‌రావృతం కాలేద‌ని చాలా పరిశోధనలు, అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి.

  వారంలో 3 రోజులైనా..

  కొంచెం ఎక్కువ తీవ్ర‌త‌ కలిగిన వ్యాయామాలు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు నివారిస్తాయ‌ట‌. వారంలో కనీసం మూడు రోజులైనా స‌రైన వ్యాయామం చేయ‌డం ఆరోగ్యానికి దోహదం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఖరీదైన జిమ్ముల్లో చేసేదే వ్యాయామం అనుకుంటే తప్పే. ప్రతి రోజు పరిసరాలను గమనిస్తూ కాస్త ఎక్కువ దూరం వేగంగా నడిచినా చాలు అని బెన్ విల్కిన్సన్ అనే అంకాలజిస్ట్ తన అభిప్రాయం చెప్పారు. వర్కవుట్ ప్రారంభించేందుకు సరైన సమయం కోసం వేచి చూడ‌డం దండగ. అనుకున్న రోజే చిన్నచిన్న వ్యాయామాల‌తో మొదలుపెట్టవచ్చు.

  ఆహారం ఆరోగ్యానికి అని మ‌ర‌చిపోవ‌ద్దు..

  కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్ద‌లు. మనం ఏ ఆహారం తీసుకున్నాఅది మన శరీరంలో కలిసి పోతుందనే విషయాన్ని విస్మరించకూడదు. ఆకలి తీరేందుకు మాత్రమే కాదు ఆరోగ్యం అందించేందుకు కూడా ఆహారం అని మరచి పోవద్దు. ఏది పడితే అది తిని కోలరెక్టల్ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి.

  మొత్తం కోలరెక్టల్ క్యాన్సర్లలో 30 నుంచి 40 శాతం ఆహారపు అలవాట్ల వల్లే అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఆహారంలో ఉండాల్సింది డైటరీ ఫైబర్. క్యాన్సర్ నివారణలో దీనిదే మొదటి స్థానం. భోజనంలో డైటరీ ఫైబర్(పీచు ప‌దార్థం) ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఫలితంగా జీర్ణవ్యవస్థ చక్కగా తన పని తాను చేసుకుపోతుంది. కోలెరెక్టల్ క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.

  శాకాహారుల్లో త‌క్కువ ముప్పు..

  శాకాహారంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే మాంసాహారం మాత్రం తగ్గించుకోవాలి. శాకాహారుల్లో కోలరెక్టల్ క్యాన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించారట. పండ్లు, కూరగాయ‌లు, గింజ ధాన్యాలు, ముఖ్యంగా లెగ్యూమ్స్ అంటే చిక్కుళ్లలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ. కనీసం 30 గ్రాముల డైటరీ ఫైబర్ ఆహారంలో ఉండేలా చూసుకొమ్మని అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర, కార్బోహైడ్రేట్లు, సాచురేటెడ్ ఫ్యాట్ ను బాగా తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండేలా ఆహారాన్ని ప్లాన్ చేసుకొమ్మ‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

  ముందు మనం మారాలి

  లింగ వయో బేధాలు లేకుండా పార్టీల సంస్కృతి సర్వత్రా వ్యాపిస్తోంది. ఆల్కాహాల్, పొగ తాగడం వంటి వన్నీ సాధారణ విషయాలై పోయాయి. కల్చర్ మారింది స‌రే.. అలాగే ఆరోగ్యం కూడా దెబ్బ తింటోందని గమనించాలి క‌దా. ఇలాంటి అలవాట్లు క్యాన్సర్‌కు ప్రత్యక్ష కారణాలు అని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి జీవన శైలి ఉన్నవారిలో 59 శాతం రిస్క్ ఎక్కువ ఉంటుందని రకరకాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

  పొగ తాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులు మాత్రమే కాదు, ఆల్కాహాల్ వ‌ల్ల లివర్‌కు మాత్రమే హానీ కాదు ఈ అలవాట్లు శరీరంలోని అన్ని వైటల్ ఆర్గాన్స్(ప్ర‌ధాన అవ‌య‌వాల‌) మీద ప్రభావాన్ని చూపుతాయని విల్కిన్ సన్ అంటున్నారు.

  బరువు స్థిరంగా ఉంచుకోవాలి..

  శరీర బరువు ఎప్పుడూ మోతాదును మించకుండా చూసుకోవాలి. ఇది క్యాన్సర్ ను మాత్రమే కాదు చాలా రకాల అనారోగ్యాలను నివారిస్తుంది. శరీరంలో ఎక్కువగా చెరిన కొవ్వు కోలన్, రెక్టల్ క్యాన్సర్లకు ప్రధాన కారణం అవుతోందట. ఇప్పుడు ఒబెసిటీని గ్లోబల్ హెల్త్ బర్డెన్‌గా భావిస్తున్నారు.

  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 శాతం మరణాలకు ఇదే కారణం అవుతోందట. ఒబెసిటీ జబ్బుల్లో కోలరెక్టల్ క్యాన్సర్ కూడా ఒకటి. కనుక బరువు అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. ఇలాంటి చిన్న చిన్న మార్పులు జీవితాన్ని ఆరోగ్య వంతం చేస్తాయి. ఆరోగ్యం మ‌హా భాగ్య‌మే కాదు ఆనంద దాయకం, కారకం కూడా.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular