కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీగా పలు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న రెబల్ అభ్యర్థులు బుధవారం చివరి రోజున పార్టీ అధిష్టానం బుజ్జగింపులు..హామీలకు తలొగ్గి తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో భారీ ఊరట దక్కినట్లయ్యింది

  • ఫలించిన అధిష్టానం బుజ్జగింపులు

విధాత : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీగా పలు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న రెబల్ అభ్యర్థులు బుధవారం చివరి రోజున పార్టీ అధిష్టానం బుజ్జగింపులు..హామీలకు తలొగ్గి తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో భారీ ఊరట దక్కినట్లయ్యింది. చివరి రెండు రోజుల్లో దాదాపు 20నియోజవర్గాల్లో రెబల్స్ వేసిన నామినేషన్లను ఉపసంహరింపచేయడంలో కాంగ్రెస్ సఫలీకృతమైంది.

సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ఆర్‌. దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పటేల్ రమేశ్‌రెడ్డి అధిష్టానం బుజ్జగింపులతో తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సహకరిస్తానని ప్రకటించారు.

తొలుత ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిలు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించిన రమేశ్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు. చివరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతో రమేశ్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. డోర్నకల్‌లో నెహ్రునాయక్‌, జుక్కల్‌లో ఎస్‌. గంగారాం, ఇబ్రహీమ్ పట్నంలో దండెం రాంరెడ్డి, బాన్సువాడలో కాసుల బాలరాజు, బోధ్‌లో వన్నెల అశోక్‌, నరేశ్ జాదవ్‌.

నకిరేకల్‌లో దైద రవిందర్‌, చొప్పదండిలో నాగి శేఖర్‌, ఇల్లందులో చీమల వెంకటేశ్వర్లు, వైరాలో రాంమూర్తి నాయక్‌, ముథోల్‌లో విజయ్‌కుమార్‌రెడ్డి, పాలకుర్తిలో లక్ష్మణ్‌ నాయక్‌, సుధాకర్ గౌడ్‌, మహబూబాబాద్‌లో భూక్యా మంగీలాల్‌, సిరిసిల్లలో ఉమేశ్‌రావు, పరకాలలో చిమ్మని దేవరాజు, చేవేళ్లలో సున్నం వసంత, వర్దన్నపేటలో సిరిసిల్ల రాజయ్యలు, అదిలాబాద్‌లో సంజీవ్‌రెడ్డిలు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే నర్సాపూర్‌లో నామినేషన్ ఉపసంహరించుకున్న పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించారు. వరంగల్ ఈస్టులో రెబల్‌గా నామినేషన్ వేసిన జంగా రాఘవరెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

Updated On 15 Nov 2023 11:44 AM GMT
Somu

Somu

Next Story