- కేసీఆర్, బీజేపీ వేరువేరు కాదు
- అధికారంలో ఉన్నప్పుడు చేసినవి అనుభవించక తప్పదు
- జగిత్యాల పాదయాత్రలో రేవంత్ రెడ్డి
(విధాత ప్రతినిధి కరీంనగర్) : గల్లీలో అయ్య, ఢిల్లీలో బిడ్డ లిక్కర్ దందా నడుపుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయ కవితపై నిప్పులు చెరిగారు.
పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్ గల్ వద్ద ఏర్పాటుచేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్గ్లోలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థలే చెబుతున్నాయన్నారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు 23 లక్షల కోట్లు వస్తే, జగిత్యాల నియోజకవర్గానికి కనీసం 23 కోట్లయినా విదిల్చారా అని ప్రశ్నించారు.
గతంలో నిజామాబాద్ లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిని గెలిపిస్తే లోక్సభలో కొట్లాడి తెలంగాణ తెప్పించారని, ఆ తరువాత కవితను ఎంపీగా గెలిపిస్తే 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న హామీని గాలికి వదిలారన్నారు.
హామీల అమలులో వైఫల్యం చెందినందునే నిజామబాద్ ప్రజలు కవితను ఇంటికి పంపించారని
తెలిపారు. పసుపు బోర్డు హామీతో గత ఎన్నికల్లో గెలుపొందిన ధర్మపురి అరవింద్ ఐదేళ్లు గడుస్తున్న దీని గురించి మాట్లాడటం లేదన్నారు.
కెసిఆర్ ను నమ్మి తెలంగాణ సమాజం ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన నేరుగా వెళ్లి ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. సిబిఐ, ఈడీలను ప్రయోగించి ప్రభుత్వాన్ని పడగొడుతుందని తాము గొంతు చించుకొని చెప్పినా కెసిఆర్ తలకెక్కలేదన్నారు.
ఇంతకాలం మోడీతో జత కట్టిన కెసిఆర్ కు ఈరోజు తామెందుకు మద్దతిస్తామని అన్నారు. తెలంగాణలో ఆ నలుగురు చేసే దోపిడీతో ప్రజలకు ఏమి సంబంధమని ఆయన ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి, నన్ను జైల్లో పెట్టి ఓడించారు… అధికారం ఉందని ఆనాడు విమలక్క, మందకృష్ణ, తీన్మార్ మల్లన్న, రవి ప్రకాష్ లను అరెస్టు చేశారు.
ప్రొఫెసర్ కోదండరాం ను ఇంటి నుండి ఈడ్చుకెళ్లారు.. అధికారంలో ఉండి మీరేం చేశారో.. అవన్నీ తిరిగి అనుభవించక తప్పదు అన్నారు. కెసిఆర్, బిజెపి అనేవి వేరు వేరు కాదని, వారిద్దరూ అవి భక్త కవలలని చెప్పారు.