‘ఇందిరమ్మ రాజ్యం అంటే 25 లక్షల ఎకరాల భూముల్లో దళితులకు పట్టాలు... 12 లక్షల ఎకరాల పోడు భూములను గిరిజనులు, దళితులకు పంచిన రాజ్యం. అలాంటి గొప్ప కాంక్షతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతున్నది’ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

- దుమ్మెత్తిపోస్తున్న కేసీఆర్ కు ఉసురు తప్పదు
- సీఎంకు రెస్ట్ ఇచ్చి.. 100 మీటర్లలోతున బొందపెట్టాలి
- బీఆరెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిని ఓడించండి
- కాంగ్రెస్ ను నమ్మించి మోసం చేసిన ద్రోహి
- నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలుపుతాం
- గిరిజన తండాల అభివృద్ధికి 100 కోట్లు
- కాళేశ్వరం కుంగింది.. మేడిగడ్డ పగిలింది
- నర్సాపూర్ సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ‘ఇందిరమ్మ రాజ్యం అంటే 25 లక్షల ఎకరాల భూముల్లో దళితులకు పట్టాలు... 12 లక్షల ఎకరాల పోడు భూములను గిరిజనులు, దళితులకు పంచిన రాజ్యం. అలాంటి కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ ప్రతి సభలోనూ తిట్టుకుంటూ తిరుగుతున్నడు. కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగిలి కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయం.. ఆయన్ను 100 మీటర్ల లోతు భూమిలో బొంద పెట్టాలి’ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పేదల బతుకుల్లో వెలుగులు నింపే ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణలో రాబోతున్నదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ప్రచార సభలో సోమవారం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 50 ఏళ్ల మిత్రుడు ఎమ్మెల్యే మదన్ రెడ్డిని సీఎం కేసీఆర్ మోసం చేసిండని, పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ ను మోసం చేసిన సునీతా లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించిందన్నారు. సునీతా లక్ష్మారెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలేదని, సీఎం కేసీఆర్ మోసంతో నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. అమ్ముడు పోయిన నాయకులను అసెంబ్లీ గేటును కూడా తాకనియ్యొద్దని అన్నారు. 3 వేల మద్యం దుకాణాలు, 18 వేల బార్లు, 63 వేల బెల్ట్ షాపులను తెరిచి తాగుబోతుల తెలంగాణను తయారు చేశారని సీఎం కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు. రైతుల ఆత్మహత్యలు, తాగుబోతుల తెలంగాణగా మార్చడంలో నెంబర్ 1గా తెలంగాణ మారిందన్నారు. అన్నారం బ్యారేజి కుంగింది... మేడిగడ్డ పగిలింది అన్నారు.
నాంపల్లి దర్గా వద్ద బిచ్చం అడుక్కునేటోడు..
తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్ద బిచ్చం అడుక్కుంటుండే అని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని, కేసీఅర్ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయన్నారు. లక్షల కోట్ల అవినీతికి బీఅర్ఎస్ పాల్పడిందని ఆరోపించారు.
కేసీఆర్ కు చేసిన అభివృద్ధి చెప్పడం చేతకాక, కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ తిరుగుతున్నారని అన్నారు. 50 ఏళ్లుగా సీఎంకు అండగా ఉన్న మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ కు నర్సాపూర్ ప్రజలు ఒక లెక్కనా అని రేవంత్ ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రచారానికి వస్తె, తనపై 2 కేసులు సీఎం పెట్టించారని అన్నారు.
కేసులు పెట్టించిన సీఎం వైపు సునితారెడ్డి పోయి కాంగ్రెస్ కు నమ్మక ద్రోహం చేశారని అన్నారు. అలాంటి ఆమెను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే నర్సాపూర్ నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ది కోసం రూ.100 కోట్లు నిధులు కేటాయిస్తామన్నారు. ఇల్లు లేని ప్రతి వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.
చార్మినార్ జోన్ లోకి నర్సాపూర్
నర్సాపూర్ ని సిరిసిల్ల జోన్ లో కలిపి ఇక్కడి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లోకి మారుస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుండి సీపీఐ తరపున 5 పర్యాయాలు అసెంబ్లీలో అడుగు పెట్టి పేద ప్రజల గొంతుక విఠల్ రెడ్డి అని తెలిపారు. నర్సాపూర్ అభ్యర్థి రాజిరెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ సమస్యలను వివరిస్తూ, గిరిజన తండాలు అభివృద్ది చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు అద్దంకి దయాకర్, ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.
