విధాత: సూపర్ స్టార్, నటశేఖరుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు పద్మాలయ స్టుడియోకు పోటెత్తారు. కృష్ణ పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శన కోసం కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పద్మాలయ స్టుడియోకు తీసుకురాగా తమ అభిమాన నటుడిని చివరిసారిగా చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో పద్మాలయ స్టుడియో వద్ద కాసేపు తోపులాట జరిగింది. భద్రతా సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్నారు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మంత్రి రోజా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు సినిమా పరిశ్రమకు చెందిన నటీ నటులు, నిర్మాతలు, దర్శకులు అందరూ పద్మాలయ స్టుడియోకు వెళ్లి తమ అభిమాన నటుడి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. మహేశ్‌బాబును, కుటుంబ సభ్యలను ఓదార్చారు.
మరి కాసేపట్లో నటశేఖర్ కృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహా ప్రస్థానంలో జరగనున్నాయి.
షూటింగ్‌లు బంద్
తమ అభిమాన నటుడు కృష్ణ మృతికి సంతాప సూచకంగా బుధవారం సినిమా షూటింగ్‌లు బంద్ పెట్టినట్లు చిత్ర పరిశ్రమ మండలి తెలిపింది. చలనచిత్ర మండలి పిలుపు మేరకు బుధవారం సినిమా పరిశ్రమ మొత్తం బంద్‌లో ఉంది. షూటింగ్‌లన్నీనిలిపి వేశారు.