ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గడిచిన తొమ్మిదిన్నరేళ్లుగా తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తాయనే నమ్మకంతో బీఆరెస్‌ ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం.. ప్రభుత్వ వైఫల్యాల

  • ‘తొలి’ ఓటర్లు పది లక్షలకుపైనే
  • మూడోవంతు 20-49 వయస్కులే
  • విద్యార్థులు, నిరుద్యోగులు ఈ కోటాలోనే
  • ఫలితాన్ని తారుమారు చేసే శక్తి!


విధాత ప్రత్యేకం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గడిచిన తొమ్మిదిన్నరేళ్లుగా తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తాయనే నమ్మకంతో బీఆరెస్‌ ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం.. ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలే తమను గట్టెక్కిస్తాయని విశ్వవిసిస్తున్నది. అయితే ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి జాబితా చూస్తే అధికారపార్టీ అంచనాలు ఏ మేరకు నెరవేరుతాయి? కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన ఫలితం వస్తుందా? అనే చర్చ నడుస్తున్నది. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న పది లక్షల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో చాలామంది అభ్యర్థుల భవితవ్యాన్ని తారు మారు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

మొత్తంగా చూస్తే.. ఈసారి ఎన్నికల్లో మూడు కోట్ల 26 లక్షలకు పైగా ఓటర్లు ఈ నెల 30న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు, మహిళలు దాదాపు చెరిసగం.. అంటే సుమారు కోటీ 63 లక్షల చొప్పున ఉన్నారు. ఇతరులు 2,676 మంది ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారి సంఖ్య సుమారు పది లక్షల వరకు ఉంటుంది. ఓటర్ల జాబితాలో 18-19 ఏళ్ల మధ్యవారు 9 లక్షల 99 వేల 667 మంది ఉన్నారు. 20-29 మధ్య వయస్సు వారి సంఖ్య 64 లక్షల 36 వేల 335గా ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 30-39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్యే అధికం. మొత్తం ఓటర్లలో వీరే 92 లక్షల 93 వేల 393 మంది ఉన్నారు. 40 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్య 66 లక్షల 96 వేల 89గా ఉన్నది. అంటే ఈ రెండు వయసుల వారి సంఖ్యే కోటిన్నరకుపైగా ఉంది. మొత్తం ఓటర్లలో సగంమంది 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్కులు. వారికి 20 నుంచి 29 ఏళ్ల వారిని కలిపితే ఆ సంఖ్య ఏకంగా రెండు కోట్ల 24 లక్షలు దాటిపోతుంది. అంటే మూడోవంతు ఓటర్లు 20 నుంచి 49 ఏళ్ల వయసు వాళ్లే. వీరు ఓటింగ్‌లో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారు.

ఆసరా పింఛన్‌దారులపై బీఆరెస్‌ నమ్మకం

57 పైబడిన వాళ్లకు ఆసరా పింఛన్లు అందిస్తున్నాం కాబట్టి వాళ్లంతా మావైపే ఉంటారన్ని అధికార పార్టీ ఆశిస్తున్నది. ఇది వాస్తవమే. అయితే ఎక్కువమంది నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఓటర్లలో సగానికి పైగా ఉన్న 20 నుంచి 49 ఏళ్ల వయస్కుల్లో ఎక్కువశాతం మంది అధికారపార్టీకి వ్యతిరేకంగా నిలబడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే బీఆరెస్‌కు భారీ నష్టం తప్పకపోవచ్చని అంటున్నారు. అలాగే యువ ఓటర్ల ఓట్లు కొన్నినియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అవకాశాలను దెబ్బతీయవచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో చాలాచోట్ల అంటే దాదాపు 80 నియోజకవర్గాల్లో బీఆరెస్‌-కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. ఇక్కడ యువ ఓటర్లలో ఎక్కువమంది బీజేపీ వైపు మళ్లితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోతుంది. అంతిమంగా అది అధికారపార్టీకి లబ్ధి చేకూర్చవచ్చనే వాదన ఉన్నది.

యువను ఆకట్టుకునే యత్నాల్లో కేటీఆర్‌

అందుకే మంత్రి కేటీఆర్‌ యువతను ఆకర్షించడానికి కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి.. షాదాబ్‌ హోటల్‌లో ప్రతి ఒక్కరినీ పలకరించారు. బీఆరెస్‌ ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అశోక్‌నగర్‌తో పాటు, వివిధ యూనివర్సిటీలలోని అభ్యర్థులతో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్న అన్ని సమస్యలపై డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడిన మర్నాడే అశోక్‌నగర్‌లో ఉద్యోగార్థులతో సమావేశమై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఇది ఎంత మేరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి.

Updated On 21 Nov 2023 7:41 PM GMT
Subbu

Subbu

Next Story