Telangana Rising Global Summit | గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా… పోయిందా

గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ? లక్ష్యం రూ.3 లక్షల కోట్లు... ఒప్పందాలు రూ.5.75, బోసిబోయిన ప్రాంగణం, అంతర్జాతీయ ప్రముఖులేరి, గ్లోబల్ పేరు చెప్పి గవర్నర్ తో ప్రారంభం, తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ బోసిపోయింది. సమ్మిట్ నిర్వహణ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నెలల నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా ఆశించిన ఫలితం కన్పించలేదు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సును పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ ను 2047 నాటికి దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు దార్శనిక పత్రం కూడా రూపొందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు విజన్ డాక్యుమెంట్ ను రూపొందించారు. ఇంతటి మహోన్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ను సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రకటించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ప్రభుత్వ పెట్టుబడుల లక్ష్యం రూ3 లక్షల కోట్లు కాగా ఒప్పందాలు మాత్రం రూ.5.75 కోట్లు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో ఎక్కువగా తెలంగాణ కు చెందిన కంపెనీలే ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాయని అంతర్జాతీయ కంపెనీలు ఆశించిన స్థాయిలో రాలేదని అంటున్నారు.

విద్యుత్ సెక్టార్ రంగంలో రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో రూ.3,24,698 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగ్గా, 1,40,500 మంది యువతకు ఉపాధి లభించనున్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒప్పందాలు జరిగాయి. ఇందులో సోలార్, పంప్డు స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్, ఈ మెథనాల ప్లాంట్, 2జీ ఎథనాల్ ప్రాజెక్టు, కంప్రెస్డు బయో గ్యాస్, ప్రోడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, మినరల్ ప్లాంట్, రైల్వేలతో పాటు గనుల రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఒప్పందాలు జరిగినట్లు పేర్కొన్నారు. అగ్రిమెంట్లు కుదుర్చుకున్న వాటిలో కనిష్టంగా రూ.1,250 కోట్లు మొదలు గరిష్టంగా రూ.50వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే.జానారెడ్డి సంబంధీకులకు చెందిన ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఏఎం గ్రీన్ ఇండియా కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆస్తా గ్రీన్ ఎనర్జీ పంప్డు స్టోరేజీ ప్లాంట్ లో రూ.4,650 కోట్ల అంచనా వ్యయంతో 750 మెగా వాట్లతో నిర్మాణం చేయనున్నది. ఏఎం గ్రీన్ ఇండియా రూ.8వేల కోట్లతో ఈ మెథనాల్, రూ.10వేల కోట్లతో మరో 2జీ ఈ మెథనాల్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.50వేల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రూ.31,198 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. కాని ఈ పెట్టుబడులు ఎప్పటిలోగా పెడతారు, ఏ ప్రాంతంలో పెడతారు అనేది మాత్రం స్పష్టం చేయలేదు. గడువు విధించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ కంపెనీలలో సుమారు ఒక లక్షా నలభై వేల మందికి ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. సంఘటిత రంగంలో ఎంత మంది, అసంఘటిత రంగంలో ఎంత మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించలేదు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయంటున్నారు.

ఇన్‌ఫ్రాకీ డిసి పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టుందుకు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. జెసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏజీపీ గ్రూప్ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) టీకాలు, పరిశోధన–అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడి ప్రకటించింది. గత పెట్టుబడితో కలిపి మొత్తం రూ.4 వేల కోట్లు అవుతుంది. 3 వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం–వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి రూ.200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు.
హైదరాబాద్ మహా నగరంతో పాటు తెలంగాణ ను అంతర్జాతీయ ముఖ చిత్రంలో మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు హాజరయితే మరో విధంగా ఉండేదని అభిప్రాయాలు పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజాలను కూడా ఆకర్షించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండో రోజు కార్యక్రమంలో మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు, కాలిఫోర్నియా ఎకనామిక్ ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్, సినీ ప్రముఖులు చిరంజీవి, దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి వారు మాత్రమే కలిశారు.

ఇవి కూడా చదవండి :

Telangana Rising Global Summit Investments : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంక‌ల్పం: మంత్రి పొంగులేటి

పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు

భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు

Latest News