కరీంనగర్ బి.ఆర్.ఎస్. అభ్యర్థి గంగుల కమలాకర్ కు గ్రామీణ ప్రజలు ముచ్చెముటలు పట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు ఎందుకు అందలేదని నిలదీస్తున్నారు.

కరీంనగర్ బి.ఆర్.ఎస్. అభ్యర్థి గంగుల కమలాకర్ కు గ్రామీణ ప్రజలు ముచ్చెముటలు పట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు ఎందుకు అందలేదని నిలదీస్తున్నారు. మూడుసార్లు శాసనసభ్యునిగా ఒరగబెట్టిందేమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన వద్దకు వెళ్లి సమస్యలు నివేదించాలనుకుంటే గంగుల చుట్టు ఉన్న కోటరీ అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన గంగులను స్థానిక మహిళలు, యువకులు నిలదీశారు. దశాబ్ధ కాలానికి పైగా తమ గ్రామానికి చేసిందేమిటని ప్రశ్నించారు. గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ గృహం ఒక్కటి కూడా మంజూరు కాలేదని, దళిత బంధు పథకంలో ఏ ఒక్కరికీ సహాయం అందలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రచారంలో గంగులను అడ్డుకుంటారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు రెండు వాహనాల్లో అక్కడకు వచ్చి ఒకచోట గుమిగూడిన ప్రజలను అక్కడి నుండి వెళ్లగొట్టారు.
అనంతరం గంగుల ఎన్నికల ప్రచార రథంపై నుండి ఉపన్యాసం ప్రారంభించగానే మహిళలు సంక్షేమ పథకాలపై ఆయనను నిలదీశారు. దీంతో నివ్వెరపోయిన గంగుల వాహనం దిగి కిందకు వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అక్కడి దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేసిన జర్నలిస్టులపై మంత్రి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియోలు తీయవద్దంటూ వారిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా జర్నలిస్టుల గుర్తింపు కార్డులు గుంజుకొని వారి ఫోటోలను తీసుకున్నారు. గ్రామంలోని పరిస్థితులను గమనించిన అధికార పార్టీ అభ్యర్థి అక్కడ ఎక్కువ సేపు ప్రచారం చేయకుండానే వెనుతిరిగారు. స్థానిక పార్టీ నేతలపై మండిపడ్డారు.
