చిన్నదంటూ కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు  విధాత: తెలంగాణలోని 30 లక్షల నిరుద్యోగుల భవిష్యత్తును ప్రస్తుతార్థకం చేసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని, లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని,అందుకే మంత్రి కేటీఆర్ లీకేజీ స్కామ్‌ను చిన్నదిగా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ TSPSC పేపర్ల లీకేజీకి మంత్రి కేటీఆర్ సంబంధం లేదంటూనే తాను సమీక్షలో పాల్గొనడంతో పాటు […]

చిన్నదంటూ కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు

విధాత: తెలంగాణలోని 30 లక్షల నిరుద్యోగుల భవిష్యత్తును ప్రస్తుతార్థకం చేసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని, లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని,అందుకే మంత్రి కేటీఆర్ లీకేజీ స్కామ్‌ను చిన్నదిగా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ TSPSC పేపర్ల లీకేజీకి మంత్రి కేటీఆర్ సంబంధం లేదంటూనే తాను సమీక్షలో పాల్గొనడంతో పాటు ప్రెస్మీట్ ఎందుకు పెట్టారని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. లీకేజీపై TSPSC చైర్మన్ స్పందించాల్సిన దానికి బదులుగా మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్ పెట్టడాన్ని ఏమనుకోవాలన్నారు. తనకు సంబంధం లేనప్పుడు మంత్రి కేటీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

తన కుటుంబ సభ్యులను కాపాడేందుకే మంత్రి కేటీఆర్ లీకేజీ కేసును చిన్నదంటూ మీడియాకు ఏకరువు పెట్టారన్నారు. టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు ప్రశ్నపత్రాల ముద్రణ, భద్రత పూర్తిగా చైర్మన్ బాధ్యత అన్నారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి వేలిముద్ర ఓటీపీలు తీసుకుంటున్న కాలంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల గదిలోకి చైర్మన్ ప్రమేయం లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలా వెళ్తారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

చైర్మన్ అధీనంలో ఉండాల్సిన కాన్ఫిడెన్షియల్ రూమ్ తాళాలు, కంప్యూటర్, పాస్వర్డ్ యూజర్ ఐడీలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లోకి వెళ్లడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు వ్యక్తుల తప్పుకు వ్యవస్థకు సంబంధమే ఉండని కేటీఆర్ మాట్లాడడం అర్ధ రహితమన్నారు. ఇప్పటికే పేపర్ లీకేజీపై గవర్నర్ తమిళ సైని కలిసి బోర్డును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.

2014 నుంచి కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పని చేస్తున్న శంకర్, లక్ష్మి, వెంకటేశ్వర్లు, వెంకట్రావులు గతంలో నుంచి పేపర్ల లీకేజ్ కు పాల్పడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే నిజాలు బహిర్గతం అవుతాయన్నారు. TSPSC అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు , వారి బంధువులకు 100 మార్కులు ఎలా వచ్చాయో మంత్రి కేటీఆర్, TSPSC చైర్మన్ చెప్పాలన్నారు.

పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వాధినంలోని సిట్‌తో కాకుండా సీబీఐతో ఎంక్వయిరీ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో పనిచేసిన అధికారిగా సిట్‌తో ఏమీ కాదని తనకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం లీకేజీలో ఉన్నప్పుడు వారి పరిధిలోని సిట్‌తో ఒరిగేదేమీ లేదన్నారు.

ఒకసారి ఫీజు కడితే టీఎస్పీఎస్సీ పరీక్షలకు సరిపోతుందని, ఆ విషయం కేటీఆర్ కి తెలవకుండా ఆయన మళ్ళీ ఫీజు కట్టనవసరం లేదంటూ తప్పుడు ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. పేపర్ లీకేజీ అంతా ప్రవీణ్ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతుందని, పెన్ డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నాయని తెలుస్తుందన్నారు.

సెక్రెటరీ పీఏగా పని చేస్తున్న ప్రవీణ్ పరీక్ష ప్రశ్నాపత్రాలు ఉండే కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి పెన్ డ్రైవ్‌తో ఎలా వెళ్లారో ప్రభుత్వం, బోర్డు చైర్మన్ సమాధానం చెప్పాలన్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌కి నెట్ కనెక్షన్ ఎలా ఇచ్చారో చైర్మన్ జనార్ధన్ రెడ్డి చెప్పాలన్నారు.

కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు పేపర్లో లీకేజ్ చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పేపర్ లీకేజీ కేసులో టీఎస్పీఎస్ చైర్మన్‌ను నిందితులుగా చేర్చి విచారించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేపర్ లీకేజీపై సరైన విచారణ జరపకపోతే తెలంగాణ అగ్నిగుండం అవుతుందన్నారు.

Updated On 19 March 2023 1:02 PM GMT
krs

krs

Next Story