తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ఎన్నికలు రాజ్యాధికారాన్ని కొన్ని అగ్ర‌ కులాల చేతుల్లోనే పెట్టింది

  • తెలుగు రాష్ట్రాల్లో రెడ్లదే హవా
  • ఆ తర్వాత కమ్మ, వెలమలు
  • బ్రాహ్మణ, వైశ్య, దళిత కులాల్లో ఒక్కొక్కరు..
  • జనాభాలో సగభాగమన్న బీసీలకు రిక్తహస్తం
  • పదేండ్ల తెలంగాణలో వెలమలు పాగా
  • దళితుడిని సీఎం చేస్తానని.. వెనక్కుతగ్గిన కేసీఆర్‌
  • తాజా ఎన్నికల్లో బీసీ మంత్రాన్ని భుజానికెత్తుకున్న బీజేపీ

విధాత: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ఎన్నికలు రాజ్యాధికారాన్ని కొన్ని అగ్ర‌ కులాల చేతుల్లోనే పెట్టింది. ఆంధ్ర రాష్ట్రం మొదలుకొని హైదరాబాద్‌ సంస్థానం విలీనం తర్వాత ఏర్పడ్డ హైదరాబాద్‌ రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, పునర్వ్యవస్థీకరణలో కొత్త రాష్ట్రం తెలంగాణలో సీఎం కుర్చీ కొన్ని అగ్ర‌ కులాల చేతుల్లోనే అధికారాన్ని చెలాయిస్తోంది. 1950 నుంచి 2023 వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారు.

ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు రెడ్డి కులానికి చెందిన 10 మంది, కమ్మ కులానికి చెందిన ముగ్గురు, వెలమ కులానికి చెందిన ఇద్దరు, ఒక్కొక్కరు చొప్పున బ్రాహ్మణ, వైశ్య, దళితులు ముఖ్యమంత్రులు అయ్యారు. తెలుగు నేలపై బీసీలు 50 శాతానికి పైగా ఉన్నా రాజకీయ చైతన్యం దక్కలేదు. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే బీసీలకు ఇక్కడ చోటు లేకుండా పోయింది.

కొత్త రాష్ట్రంలో దళితులు, బీసీలే లక్ష్యంగా..

కర్నూలు రాజధానిగా 1956 నవంబర్‌ 1న తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఈక్రమంలో 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భావం తర్వాత ఊరించిన దళిత ముఖ్యమంత్రి నినాదం ఆదిలోనే ఆశలను తుంచివేసింది. అధికారం చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆ వర్గానికి మొండిచేయి చూపారు.

తాజా ఎన్నికల్లో బీజేపీ బీసీ మంత్రాన్ని జపిస్తోంది. ఆపార్టీ సూర్యాపేట వేదికగా నిర్వహించిన జనగర్జన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని తెలంగాణ ఓటర్లకు మాటిచ్చారు. పదేండ్ల తెలంగాణలో రాజకీయ పార్టీలు దళితులు, బీసీల లక్ష్యంగా ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నాయి.

సీఎం పీఠానికి దూరంగా బీసీలు

తెలుగు రాష్ట్రాల్లో బీసీల జనాభా సగానికి పైగానే ఉంది. వివిధ రాజకీయ పార్టీల్లోనూ బీసీ నేతలకు కొదవ లేదు. వారికి ఇప్పటివరకూ రాజకీయ, నామినేటెడ్‌ పదవులే కట్టబెడుతూ ఆయా పార్టీల అధిష్టానం సీఎం పీఠానికి దూరం చేస్తోందన్న విమర్శలూ లేకపోలేదు. ఇప్పటివరకూ ఆ వర్గంలో ముఖ్యమంత్రి స్థాయిలో రాజకీయంగా ఎవరూ ఎదగలేక పోయారన్న వాదనా లేకపోలేదు. వెనుకుబాటుతనం కారణంగా భిన్నమైన సామాజిక, ఆర్థిక స్థాయి వారిని పీఠంపై కూర్చోపెట్టలేకపోయిందన్న చర్చ కూడా తెరపైన ఉంది.

తెలుగురాష్ట్రాల్లో గౌతు లచ్చన్న, అనగాని భగవంతరావు ప్రజాక్షేత్రంలో తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. అదే వరుసలో దేవేందర్‌ గౌడ్‌, కేఈ కృష్ణమూర్తి, రఘువీరారెడ్డి వంటి బీసీ నాయకులు రాజకీయంగా, సామాజికంగా తమ స్థాయిల్లో నిలదొక్కుకున్నారు. 1978లో కాంగ్రెస్‌ పార్టీలో బీసీ సీఎం చర్చ జరిగింది. అప్పటి నిజామాబాద్‌ కు చెందిన మున్నూరు కాపు నేత గడ్డం రాజారాం తెరపైకి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీపడినా, చివరి నిమిషంలో మర్రి చెన్నారెడ్డికి పీఠం దక్కింది. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడైనా, వేరుపడిన తర్వాత అయినా అధికార పీఠం ఏ కులం చేతిలో ఉందో ఓసారి పరిశీలిస్తే..హైదరాబాద్‌ రాష్ట్రంలో బ్రాహ్మణులకే..

భారతదేశ స్వాతంత్య్రానంతరం 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం విలీనమైన తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రంగా ప్రకటింపబడింది. తెలంగాణ ఇందులోనే భాగమైంది. తొలుత 1950-1952 వరకు తమిళనాడుకు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ అధికారి అయిన ఎంకే వెల్లోడిని అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కొనసాగించింది. తదనంతరం తెలుగువారైన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రిగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడినంత వరకు బ్రాహ్మణ కులానికి చెందిన బూర్గుల కొనసాగారు.

ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణ, రెడ్డి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం.. బ్రాహ్మణ కులానికి, బెజవాడ గోపాలరెడ్డి.. రెడ్డి కులానికి చెందినవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అంటే 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది ముఖ్యమంత్రులుగా కొనసాగారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.. రెడ్డి కులానికి, ఆతర్వాత దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి సీఎం పదవి చేపట్టిన నీలం సంజీవరెడ్డి 1964 ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం 1971 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి... రెడ్డి కులానికి, 1971-1973 వరకు బ్రాహ్మణుడైన పీవీ నరసింహారావు, ఆ తర్వాత 1973 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు రాష్ట్రపతి పాలన అనంతరం వెలమ కులానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు.


ఆ తర్వాత రెడ్డి కులానికి చెందిన మర్రి చెన్నారెడ్డి, కులమే వివాదాస్పదమైన టంగుటూరు అంజయ్య ముఖ్యమంత్రులు అయ్యారు. అంజయ్య.. గౌడ, దళితుడు, రెడ్డి అనే వాదనలు అప్పట్లో తెరపైకి వచ్చాయి. అయితే అతనే స్వయంగా రెడ్డి కులానికి చెందిన వాడిగా వెల్లడించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. 1982 ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు వరకు ముఖ్యమంత్రిగా రెడ్డి కులానికి చెందిన భవనం వెంకట్రామిరెడ్డి, 1982 నుంచి 1983 వరకు అదే రెడ్డి కులానికి చెందిన కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కొనసాగారు. 1983-84 వరకు కమ్మ కులానికి చెందిన ఎన్టీఆర్‌, 1984లో కొంతకాలం అదే కమ్మ కులానికి చెందన నాదెండ్ల భాస్కర్‌ రావు, తర్వాత 1989 వరకు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.


1990-95 మధ్య కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, ఎన్టీఆర్‌ మళ్లీ సీఎంలు అయ్యారు. 1995 నుంచి కమ్మ కులానికి చెందిన చంద్రబాబు, రెడ్డి కులానికి చెందిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంలు అయ్యారు. 2009లో వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత వైశ్య కులానికి చెందిన రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయేవరకు రెడ్డి కులానికి చెందిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కు చంద్రబాబు, తెలంగాణకు వెలమ కులానికి చెందిన కేసీఆర్‌ ముఖ్యమంత్రులు అయ్యారు. ఆతర్వాతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో రెడ్డి కులానికి చెందిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణలో వెలమ కులానికి చెందిన కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు.

Updated On 17 Nov 2023 10:11 AM GMT
Somu

Somu

Next Story