కాంగ్రెస్‌ పాలన బాగుంటే ఎన్టీఆర్‌ టీడీపీని ఎందుకు పెట్టేవారని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు.. మరి కేసీఆర్‌ పాలన బాగుంటే జనం ప్రత్యామ్నాయం ఎందుకు ఆలోచిస్తున్నారు?


  • బీఆరెస్‌ పాలన బాగుంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు?
  • ప్రత్యామ్నాయ పార్టీలవైపు ఓటర్లు చూపు ఎందుకు?
  • కాంగ్రెస్‌ను బూచిగా కేసీఆర్‌ చూపుడు ఎందుకు?
  • మరోసారీ తెలంగాణ సెంటిమెంట్‌ పైనే కేసీఆర్‌ ఆశ!
  • రాజకీయ విశ్లేషకుల్లో చర్చలు

విధాత: ‘బీఆర్‌ఎస్‌ తెలంగాణ కోసమే పుట్టింది. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలి. కాంగ్రెస్‌ పాలన బాగుంటే టీడీపీ ఎందుకు పుట్టి ఉండేది?’ అని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల్లో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఇదే లాజిక్‌తో ఆలోచిస్తే.. బీఆర్‌ఎస్‌ పాలన బాగుంటే ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ వైపు ఎందుకు చూస్తారు? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుందని పరిశీలకులు అంటున్నారు. బీఆరెస్‌ పాలనే బాగుంటే.. ప్రజలకు కొత్తగా బీఆరెస్‌ పాలన గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. కాంగ్రెస్‌ గెలిస్తే కలిగే నష్టాలను వివరించాల్సిన అవసరమూ లేదు. బీఆరెస్‌ పాలన ప్రజలందరికీ నచ్చి ఉంటే.. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతుంటే.. వారంతా హాయిగా బతుకుతూ ఉంటే.. ప్రతిపక్షాలకు ఆదరణ ఎందుకు పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు ప్రశిస్తున్నారు.

ప్రశ్నించడాన్ని సహించని సీఎం?

ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో కొన్ని లోపాలను ఎత్తిచూపినా, ప్రశ్నించినా, అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేసీఆర్‌ పట్టించుకోరనే అభిప్రాయం బలంగా ఉన్నది. కేసీఆర్‌తో గతంలో సన్నిహితంగా మెలిగి.. ఆ తర్వాతి కాలంలో దూరమైన అనేకమంది ఉద్యమకారులు చెప్పేదీ ఇదే. దాని వల్లే ప్రస్తుత ఎన్నికల్లో బీఆరెస్‌ ఎదురీదే పరిస్థితి నెలకొన్నదని అంటున్నారు. కనీసం ఆరు నెలల ముందు కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకుని ఉన్నా.. పట్టుజారిపోయే ప్రమాదం ఎదురయ్యేది కాదని చెబుతున్నారు. కర్ణుని చావుకు వంద కారణాలు అన్నట్టు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆ పార్టీ గత పదేళ్లలో ఇచ్చిన హామీలను విస్మరించడం వంటివే ప్రస్తుతం ప్రతిపక్షాలు ఆయుధాలు అయ్యాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరి వెళ్లిన ప్రజాప్రతినిధులకు అవే ప్రశ్నలు ఎదురవుతుండటం గమనార్హం.


మీ పాలన తీరు బాగుంటే ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు? అనేది కేసీఆర్‌ ఆలోచించాలి అంటున్నారు. కానీ.. కేసీఆర్‌ మాత్రం తెలంగాణ సెంటిమెంట్‌నే మూడో దఫా కూడా ప్రయోగించి.. గట్టెక్కే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఆయన సభలను గమనిస్తే అర్థమవుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. మూడో విడుత ఎన్నికలకు వచ్చేసరికి.. తెలంగాణ సెంటిమెంట్‌, గత చరిత్ర కంటే పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన, వైఫల్యాల ఆధారంగానే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత తెలంగాణ ఆత్మను కేసీఆర్‌ చంపేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు.. ఇతర ఉద్యమకారులు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టింది వాస్తవమే అయినప్పటికీ కేసీఆర్‌ 2014 ఎన్నికలకు ముందు కరీంనగర్‌లో మాట్లాడుతూ.. ఇక నుంచి మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్న విషయం విదితమే. ఇంకా తెలంగాణ పేటెంట్‌ హక్కులు బీఆరెస్‌కు మాత్రమే సొంత అన్నట్టు ఆ పార్టీ నేతలు మాట్లాడటంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Updated On
TAAZ

TAAZ

Next Story