మన ఇంటి చుట్టూ లేదా కిచెన్ గార్డెన్‌లో సులభంగా పెరిగే వాము మొక్క ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా వాము గింజల గురించి చాలామందికి తెలుసు.
కానీ వాము ఆకుల్లో కూడా అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ ఆకులు మందపాటి గా, పచ్చగా ఉండి ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి.
ఆయుర్వేదంలో వామాకు ఆకులను ఎన్నో రకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. వామాకు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. వాతావరణం మారినప్పుడు తరచూ వచ్చే శ్వాసకోశ సమస్యలకు వామాకు మంచి సహజ ఔషధంగా పనిచేస్తుంది.
కషాయం రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపడటానికి సహాయపడుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వామాకు కషాయం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.
ఆకులను నీటిలో మరిగించి తాగితే శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుంది. పిల్లలకు జలుబు వచ్చినప్పుడు వామాకు రసం కొద్దిగా తేనెతో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది
మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా వామాకు ఉపయోగపడుతుంది. మూత్రం సరిగ్గా పోకపోవడం, రాళ్ల సమస్యలు ఉన్నవారికి ఇది సహాయపడుతుందని నమ్మకం.
ఇది సహజంగా మూత్ర విసర్జనను పెంచి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అలాగే కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు వామాకు ఉపశమనాన్ని ఇస్తుంది.