Sambhavi Choudhary : లోక్‌సభ ఎన్నికల తంతు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా కొన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలోనే ఉన్నాయి. తాజాగా లోక్ జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం తన పార్టీ నుంచి పోటీపడబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తాను పోటీ చేయబోతున్న మొత్తం ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఎన్‌డీఏతో భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా బీహార్‌లో ఎల్జేపీకి ఐదు సీట్లు దక్కాయి. ఆ స్థానాలకు పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ శనివారం అభ్యర్థులను ఖరారు చేశారు. చిరాగ్ పాశ్వాన్ హజీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. తాను లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన జాముయి సీటును నిలబెట్టుకునేందుకు తన బావ అరుణ్ భారతిని అక్కడ నుంచి బరిలో దించారు. ఇక పార్టీ జాబితాలో వైశాలి నుండి టిక్కెట్ పొందిన ఏకైక సిట్టింగ్ ఎంపీగా వీణాదేవి ఉన్నారు. అలాగే రాజేష్ వర్మకు ఖగారియా టిక్కెట్ ఇచ్చారు.
ఇక జేడీయూ మంత్రి అశోక్ కుమార్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరిని చిరాగ్ ఎల్జేపీ తరఫున రంగంలోకి దింపడం ఇక్కడ విశేషం. చిరాగ్ బంధువు ప్రిన్స్ రాజ్ ప్రాతినిధ్యం వహించిన సమస్తిపూర్ రిజర్వు స్థానం నుంచి శాంభవి పోటీ చేస్తున్నారు. 25 సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సులో శాంభవి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. తన కుటుంబంలో మూడో తరం రాజకీయ నాయకురాలిగా శాంభవి బరిలో దిగారు. దాంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలైన దళిత మహిళగా ఆమె గుర్తింపు పొందే అవకాశం ఉంది. శాంభవి తాత మహావీర్ చౌదరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీహార్ మంత్రిగా పనిచేశారు.
కాగా, శాంభవి లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ‘బీహార్ రాజకీయాల్లో లింగ, కులాల విభజన’ అనే అంశంపై డాక్టరేట్ చేస్తున్నారు. బీహార్‌లోని దేవాలయాలలో అనేక మంది దళిత పూజారులను నియమించిన ఘనత పొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆచార్య కిషోర్ కునాల్ కుమారుడు సాయన్ కునాల్‌ను శాంభవి వివాహం చేసుకున్నారు.