Site icon vidhaatha

ఎయిర్‌పోర్టుకు అదనంగా 200 ఎకరాలు

విధాత,నెల్లూరు:దగదర్తిలో నిర్మించనున్న ఎయిర్‌పోర్టుకు అదనంగా 200 ఎకరాలను అప్పగించినట్లు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు.కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్ద స్థాయి ఎయిర్‌పోర్టును ప్రభుత్వం నిర్మించే ఆలోచన చేస్తోందన్నారు.ఎయిర్‌పోర్టుకు సంబంధించి భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. పోర్టు నిర్మాణ పనుల ప్రారంభంపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

ఫిషింగ్‌ హార్బర్‌కు భూ సమస్యలు తొలగిపోయాయని, త్వరలోనే నిర్మాణ పనులు మొదలు పెడతామని స్పష్టం చేశారు. ‘నాడు- నేడు’ పేరుతో గ్రామ కొలనుల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని, అనుమతులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోనే మొదటగా గ్రామ కొలనుల అభివృధ్ధిపై ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. జిల్లాలో కొవిడ్‌-19 కేసులు తగ్గకపోవడంపై సమీక్షిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు, చెన్నై ప్రాంతాలకు జిల్లా నుంచి ఎక్కువగా రాకపోకలు జరుగుతుండటమే కారణంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా కచ్చితంగా నిబంధనలు పాటించాలని తెలియజేశారు.

Exit mobile version