Site icon vidhaatha

బయోటెక్ పార్క్ హబ్ గా అనంతపురం..మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అనంతలో బయోటెక్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు
త్వరలో పుట్టపర్తి విమానాశ్రయం పున: ప్రారంభించేదిశగా ప్రభుత్వం కసరత్తు
అనంతపురం జిల్లాలో ఐ.టీ కాన్సెప్ట్ సిటీ ఏర్పాటుకు కృషి
అనంత జిల్లా యువతకు నైపుణ్య వికాసం కోసం పుట్టపర్తిలో స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటు
పుట్టపర్తి ఎమ్ఎస్ఎమ్ఈ పార్కును రీస్టార్ట్ చేస్తాం
అనంతపురం జిల్లాలో ‘ఇండస్ జీని ఎక్స్ ప్రెషన్స్ లిమిటెడ్’ బయోటెక్ పరిశ్రమ విజిట్, పుట్టపర్తి విమానాశ్రయం పై ట్రస్టు సభ్యులతో చర్చ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

విధాత,అమరావతి: అనంతపురం జిల్లాను బయోటెక్ పార్కుల హబ్ గా తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే పుట్టపర్తి విమానాశ్రయ సేవలను పున: ప్రారంభించేందుకు పుట్టపర్తి ట్రస్ట్ సభ్యులతో చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు గ్రామంలోని యూ.ఎస్ ఆధారిత ‘ఇండస్ జీని ఎక్స్ ప్రెషన్స్ లిమిటెడ్’ బయోటెక్ పరిశ్రమను మంత్రి గౌతమ్ రెడ్డి సోమవారం విజిట్ చేశారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయ పున: ప్రారంభం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేసే దిశగా పుట్టపర్తి సత్యసాయి ట్రస్టు సభ్యులతో చర్చించేందుకూ పరిశ్రమల శాఖ మంత్రి సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు.

ఏపీలో 3 ఐ.టీ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయడంలో భాగంగా అనంతపురం జిల్లాలోనూ ఒక కాన్సెప్ట్ సిటీని నిర్మించనున్నట్లు ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. అనంత యువతకు నైపుణ్య వికాసాన్నందించే దిశగా పుట్టపర్తిలో స్కిల్ డెవలప్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు పూర్తయ్యాయని మంత్రి మేకపాటి తెలిపారు. అనంత జిల్లాలో వలసలు లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకువెళుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే అనుమతుల ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆర్థిక నిధుల సమీకరణ పూర్తి చేసి 30 స్కిల్ కాలేజీల ఆలోచనను ఆచరణ దిశగా పట్టాలెక్కించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికానుకూల వాతావరణం, నైపుణ్యం, విద్య, వసతుల ద్వారా మాత్రమే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని మంత్రి గౌతమ్ రెడ్డి పునరుద్ఘాటించారు. నైపుణ్య కొరత, కమ్యునికేషన్ లో ఇబ్బందుల వంటి అంశాలలో వెనుకబడడంవలనే యువత ఉద్యోగావకాశాలు కోల్పోతున్నట్లు మంత్రి అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ వేర్ నుంచి ఏ రంగమైన ఆంగ్లభాష తప్పనిసరైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రణాళిక వెనుక ఎంతో మేధోమథనం జరిగిందన్నారు.

అనంతపురం పారిశ్రామికాభివృద్ధి పై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళుతున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఉద్యోగావకాశాలను పెంచి వలసలు ఉండే అనంత జిల్లాను వలసలకు అవకాశం లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తామన్నారు. బెంగళూరు సమీపంలో ఉన్న అనంతపురం జిల్లాలో పారిశ్రామిక భూములు సహా అనేక సదుపాయాలున్నాయని మంత్రి స్పష్టం చేశారు. హిందూపురం, పుట్టపర్తి ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మేకపాటి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. 104 ఎకరాలలో విస్తీర్ణమైన పుట్టపర్తి ఎం ఎస్ ఎం ఈ పార్కును కూడా పూర్తి చేయడానికి చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.ఉపాధి అవకాశాలు పెంచి అనంత జిల్లాలో వలసలు లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకువెళుతోందని ఆయన అన్నారు.

అనంతపురం జిల్లాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా హిందూపురానికి చేరిన జిల్లాకు వచ్చిన మంత్రి మేకపాటికి పూలగుచ్చాలిచ్చి, శాలువాలతో సన్మానిస్తూ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అనంతపురం జిల్లా నాయకులు, అధికార యంత్రాంగం స్వాగతం పలికారు.

Exit mobile version