డిమాండ్ల సాధన కోసం గత కొన్నేళ్లుగా పోరాటం
విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సమ్మె బాట
ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ధర్నా చేపట్టిన స్టాఫ్ నర్సులు.. మద్దతు తెలిపిన జిల్లా ఎన్జీఓ సంఘం
కరోనాతో అశువులు బాసిన వైద్య సిబ్బంది నివాళులు అర్పించిన స్టాఫ్ నర్సులు
విధాత :గత కొన్నేళ్లుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న స్టాఫ్ నర్సులు ఇవాల్టి నుంచి సమ్మె బాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్టాఫ్ నర్సులు ఇవాళ విధులు బహిష్కరించి… ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ధర్నా చేపట్టారు. ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. వీరి జిల్లా ఎన్జీఓ సంఘం కూడా మద్దతు పలికింది. ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు అతావుల్లా వీరి శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అతావుల్లా మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వీరి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారని.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లాంటి విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వారి సేవలను గుర్తించాలన్నారు. ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అసోషియేషన్ సభ్యులు శ్రీదేవి, ఇతర సభ్యులు మాట్లాడుతూ విధి నిర్వహణలో చనిపోయిన హెల్త్ వర్కర్స్ కి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా పునరుద్ధరించాలన్నారు. ఒకే కేడరు ఒకే వేతనం అమలు చేయాలని.. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను, సిబ్బందిని రెగ్యులరైజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే అను నిత్యం కరోనా మధ్య జీవిస్తున్న తమకు జిల్లాలో 50 ఆక్సిజన్ బెడ్స్ తో వార్డు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు కరోనా సమయంలో విధి నిర్వహణలో అశువులు బాసిన వైద్య సిబ్బందికి స్టాఫ్ నర్సులు నివాళులు అర్పించారు.