YS Sharmila : లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ అన్నాచెల్లెళ్ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఎన్నికల ప్రచారసభల్లో, సోషల్ మీడియాలో ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల పలు ప్రశ్నలు సంధిస్తూ తన సోదరుడు జగన్‌మోహన్‌రెడ్డికి సంచలన లేఖ రాశారు. ఆ లేఖలో తాను లేవనెత్తిన సందేహాలు అన్నింటికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 28 సంక్షేమ పథకాలను ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో దళితులకు భూమిని పంపిణీ చేసే కార్యక్రమం ఎందుకు ఆగిందని షర్మిల ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎందుకు దారి మళ్ళించారని నిలదీశారు. డ్రైవర్‌ని చంపిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్ధిస్తున్నారని నిలదీశారు. స్టడీసర్కిళ్లకు ఎందుకు నిధులు ఇవ్వలేదని తన లేఖలో ప్రశ్నించారు.