విధాత:భారతీయ సమాజానికి సంస్కృతి నేర్పినది బీసీలేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాంటి వర్గాలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి వెనుకబాటుతనానికి గత పాలకుల పట్టనితనమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. దానికి పూర్తి విరుద్ధంగా అట్టడుగు వర్గాల్లో ఆఖరి వ్యక్తి వరకు అభివృద్ధి–సంక్షేమ ఫలాలు అందాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పెండ్ర వీరన్న అధ్యక్షతన సంచారజాతుల రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌కు సమాజం పట్ల గల ప్రేమ, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల గల చిత్తశుద్ధి, రాష్ట్రాభివృద్ధిపై గల అంకితభావం కారణంగా ఒక స్పష్టమైన అజెండా రూపొందించుకుని ఆయన ముందుకు సాగుతున్నారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని, తన ఆలోచనలను ఆచరణ రూపంలో పెట్టడంపై ఉన్న పట్టుదల వలనే కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పధకాలు ఆగకుండా కొనసాగాయన్నారు.
బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి… ఈనాడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి చేసినట్లు మరే ఇతర ముఖ్యమంత్రి చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ఎంబీసీల్లో ఉన్న 32 ఉప కులాల సంక్షేమం కోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం నినాదాల పార్టీ కాదన్నారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుకనే ఇంతకాలం మరుగున పడి ఉన్న మన కులాలు వెలుగులోకి వచ్చి లబ్ధి పొందుతున్నామనీ… అదే మరొకరు ముఖ్యమంత్రి అయితే ఇది సాధ్యం కాదనీ… ముందుగా ఎంబీసీలు తెలుసుకోవాలని ఆయన కోరారు. తర్వాత ఈ వాస్తవాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్ళాని ఆయన కోరారు. మరింత మేలు జరిగే విధంగా రానున్న 30 సంవత్సరాల కాలంలో జగనే ముఖ్యమంత్రిగా కొనసాగే విధంగా ఆయనకు అన్ని విధాలా అండదండలందించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రాజ్యమేలుతుందన్నారు. దీన్ని బీసీల్లోని అన్ని కులాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు. ఇటు పార్టీ పదవులు, అటు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో ముఖ్యమంత్రి జగన్ బీసీలకు సమాన వాటా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇది బీసీలకు శుభపరిణామన్నారు. బీసీల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చే రీతిలో జగన్ తన పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారని తెలిపారు. బీసీల జీవితాలు మరింత మెరుగుపడాలంటే… బీసీలు మరింత ఉన్నత స్థితికి చేరాలంటే… జగనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఎంబీసీ అంటే… మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదనీ – మోస్ట్ బ్యాక్‌బోన్ క్యాస్ట్ అనీ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎలుగెత్తి చాటిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఊతాన్ని ఆసరా చేసుకుని ఎంబీసీల్లో ఉన్న 32 ఉప కులాలు ఒక్కొక్కటి ఒక్కొక్క బలమైన కులంగా ఎదగాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో ఒకొక్క కులానికి ఒక్కొక్క ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావాలని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగా మిమ్మల్ని బలోపేతం చేయడానికీ, మీలో నాయకత్వ లక్షణాలు పెంచడానికీ, రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించి గౌరవప్రదమైన స్థానంలో నిలపడానికీ…దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మరే ఇతర ముఖ్యమంత్రికీ పట్టని రీతిలో బీసీ కష్టసుఖాలు పట్టించుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అప్పిరెడ్డి చెప్పారు.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన కూడు, గూడు, గుడ్డకు కూడా నోచని దుర్భర స్థితిలో సంచార జాతులు జీవనం కొనసాగిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వారి జీవనంలో సమూలమైన మార్పు తెచ్చేందుకు జగన్ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, సంచార జాతుల సంఘాల నాయకులు గండగత్తిరి సుధాకర్, జి.రామాంజనేయులు, ముంగి గురవయ్య, ధనకొండ ఎబెల్ రాజు, జోగి వెంకటేష్, సాలా అశోక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.