Site icon vidhaatha

ప్రజల కోసం పాలించే కూటమిని గెలిపించుకోండి

విధాత, హైదరాబాద్ : ప్రజల కోసం పరిపాలన ఉండాలని, స్వార్థం కోసం ప్రజలను దోచుకునే పార్టీలు అధికారంలోకి వస్తే మనుగడ కష్టమని, అందుకే ఈ ఎన్నికల్లో ప్రజపాలన చేసే టీడీపీ కూటమిని గెలిపించుకోవాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు సూచించారు. నెల్లూరులో షాదీ మంజిల్‌లో ముస్లిం మైనార్టీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ముస్లింలకు టీడీపీ పాలనలో లేక వైసీపీ పాలనలో న్యాయం జరిగిందో ఆలోచించాలని కోరారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ లేదని ఆరోపించారు. హజ్‌ యాత్ర కు వెళ్లే ముస్లింలకు రూ. లక్ష ఇస్తామని, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతానని, మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో కంటే టీడీపీ కూటమి ప్రకటించిన మ్యానిఫెస్టో సూపర్‌గా ఉంటుందన్నారు. మన సూపర్ సిక్స్ ముందు జగన్ మ్యానిఫెస్టో వెలవెలబోయిందన్నారు. వైసీపీ మ్యానిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి ఏమీ లేదని, సీపీఎస్‌ రద్దు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రస్తవించలేదన్నారు. మ్యానిఫెస్టో విడుదలతో జగన్ రాజకీయాలకు అస్త్రసన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని పేర్కొన్న జగన్‌ హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి గోదావరిలో కలిపారని వెల్లడించారు. గతంలో టీడీపీ పరిపాలన స్వర్ణయుగం కాగా వైసీపీ పాలన రాతియుగమని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్పీ పైనే ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపొందుతుందని.. సైకో జగన్‌ ఇంటికి పోవడం ఖాయమన్నారు. టీడీపీ పాలనలో మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి చేయూతనిచ్చే పథకాలు అమలు చేస్తామన్నారు.

Exit mobile version