Site icon vidhaatha

Chandrababu | మేం ఎన్డీఏతోనే.. టీడీపీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే విజయం

అవినీతి..అరాచక పాలనతోనే వైసీపీకి దారుణ ఓటమి
నా కుటుంబానికి జరిగిన అవమానం భరించలేకపోయాను
సేవకులుగా పనిచేస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు

విధాత: జాతీయ స్థాయిలో తాము ఎన్డీఏ కూటమితోనే ఉన్నామని, ..భేటీకి వెలుతున్నామని, మరో ఆలోచనకు తావు లేదని టీడీపీ అధినేత ఎన్‌. చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇండియా కూటమితో చేతులు కలుపుతారన్న వార్తలను కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయ పరిణామాలు చూశానని, ఎన్డీఏ కూటమిగానే ఎన్నికలకు వెళ్లామని, సమిష్టి విజయంతోనే భారీ విజయం సాధ్యమైందన్నారు. టీడీపీ చరిత్రలో ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావ సమయంలో మాత్రమే 200సీట్లు సాధించడం జరిగిందని, మళ్లీ అంతటి భారీ విజయాన్ని పార్టీ సాధించిందని, పార్టీ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించే విజయమన్నారు.

ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, పక్క రాష్ట్రాల్లో కూలి పనులు చేసుకునే వారు, విదేశాల్లో ఉన్నవారు సైతం ఖర్చులకు వెనుకాడకుండా వచ్చి ఓటు వేసిన తీరు అద్భుతమన్నారు. నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో జగన్ వంటి విధ్వంసం ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశామన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయమని చెప్పారు. కూటమికి 55.38 శాతం ఓట్లు రాగా.. 45.60 శాతం టీడీపీకి వచ్చాయని, వైఎస్సార్‌సీపీకి 39.37 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపారు.

అవినీతి అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది

అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుందని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. ఐదేళ్లు మా కార్యకర్తలు చాలామంది ఇబ్బందిపడ్డారని, కార్యకర్తలకు కంటినిండా నిద్ర కూడా పోని పరిస్థితి కొనసాగిందన్నారు. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారని, మీడియాను కూడా ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టారని, ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. అధికారం ఉంటే ఎవరినైనా ఏదైనా చేయవచ్చనే దాడులు చేశారని, విశాఖకు వెళ్తే పవన్‌ను వెనక్కి పంపివేశారని, కేసులు ఎందుకు పెట్టారని ఎవరైనా అడిగితే అరెస్టులు చేశారని ఆరోపించారు. సహజ సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని, అడ్డొచ్చిన వారిపై దాడులు చేసి బెదిరించారన్నారు. నేను మిగులు విద్యుత్‌ తీసుకొస్తే వైసీపీ నాశనం చేసిందని, 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి భారం మోపారని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్లలో 30 ఏళ్ల డ్యామేజ్‌ జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.

అవమానాన్ని భరించలేకపోయాను

నా కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయానని చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. నాపై బాంబులతో దాడి చేసినప్పుడు కూడా బాధపడలేదని, మళ్లీ సీఎంగానే వస్తానని ఆనాడు అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేశానని, నా ప్రతిజ్ఞను నిజం చేయడానికి ప్రజలు కూడా తోడ్పడ్డారని, నాపై నమ్మకం పెట్టుకున్న వారికి చక్కటిదారి చూపిస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. మా ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని పవన్‌ పట్టుబట్టారని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే పవన్‌ కృషి చేశారని, అందుకే కూటమిలో బీజేపీ భాగస్వామ్యమైందని, పొరపాట్లు లేకుండా ముగ్గురం కలిసి పనిచేశామని, సమష్టి కృషితో విజయం సాధించగలిగామని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమన్నారు. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని, రాష్ట్ర ఉన్నత భవిష్యత్ కోసం పనిచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కూటమిని గెలిపించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, తాము పాలకులం కాదు.. సేవకులం అని నిరూపించేలా పాలన చేస్తామన్నారు.

Exit mobile version