Site icon vidhaatha

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే సిఎం వైఎస్ జగన్ ధ్యేయం :MLC లేళ్ల అప్పిరెడ్డి.

విధాత:ఉన్నత చదువులు – ఉత్తమ పదవులు కేవలం కొన్ని కులాలకు మాత్రమే పరిమితమనే రోజులకు కాలం చెల్లిందని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు.కులం, మతం చూడకుండా ధనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారసత్వ రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోకుండా విశ్వసనీయత నిబద్ధతతో పని చేయాలనే తపన తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు గౌరవం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధంగా ఉన్నట్లు అప్పిరెడ్డి ప్రకటించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పెరిక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పి.గంగాభవాని అధ్యక్షతన పెరిక కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ,బలమైన నాయకత్వంగా బీసీలను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శకానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెలిపారు. సమకాలీన రాజకీయాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కరేనని చెప్పారు. ప్రత్యేకించి బీసీలను బలమైన నాయకులుగా తీర్చిదిద్దేందుకే వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ప్రభుత్వ పనులు, అటు నామినేటెడ్‌ పదవుల్లో అగ్ర తాంబూలం ఇస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే గడచిన నెల రోజులుగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్రంలోని బీసీల అభివృద్ధి కోసం జరుగుతున్న నేపధ్యంలో ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత చేకూరినట్లు అప్పిరెడ్డి వెల్లడించారు.
బీసీల సంక్షేమానికి తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముందడుగు వేస్తే... ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ నాలుగడుగులు ముందుకు వేసి బీసీ జన బాంధవుడుగా నిలిచారని అప్పిరెడ్డి తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలన్న పెద్ద మనసుతో వెనుకబడిన తరగతుల్లో ఆఖరి వరసన ఉన్న ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూరుస్తున్న మహనీయుడుగా జగన్‌ను అభివర్ణించారు. జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో కొత్త యుగం ఆరంభమైందన్నారు. భవిష్యత్తు తరాలు దీన్ని జగన్‌ ముందు – జగన్‌ తర్వాత అని చరిత్రలో చదువుకునే విధంగా పరిపాలనను ప్రతి ఇంటి ముంగిటకూ తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి జగన్‌ అని కితాబిచ్చారు. సీఎం జగన్‌ ఇస్తున్న ఈ సహకారాన్ని అందిపుచ్చుకుని బీసీలు అన్ని రంగాల్లో బలపడాలని కోరారు. ఈ మేలు కొనసాగేందుకు వీలుగా జగన్‌ను ఐదేళ్ళ సీఎంగా కాక 30 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉంచేందుకు ఆయనకు సంపూర్ణ అండదండలు అందించాలని లేళ్ళ అప్పిరెడ్డి బీసీలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ,రాష్ట్రంలో జగన్‌ నాయకత్వంలో పని చేస్తున్న ప్రభుత్వం బీసీలదని పేర్కొన్నారు. బీసీల సంక్షేమమే జగన్‌ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన కులాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి బాట పట్టించే దిశగా జగన్‌ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంతో పాటు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న జగన్‌ హయాం బీసీలకు స్వర్ణ యుగమని ఆయన స్పష్టం చేశారు. నవరత్నాల అమలు కమిటి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌ను నవయుగ పూలేగా పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఇంతలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రిని ఇంత వరకు ఎవరూ చూడలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెరిక కార్పొరేషన్‌ డైరెక్టర్లు, కుల సంఘాల పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
Exit mobile version