Site icon vidhaatha

సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు దాసరి శ్రీనివాస్ పదవీ విరమణ

సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు దాసరి శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా 27 యేళ్ల ఉద్యోగ విధి నిర్వహణలో సంస్థకు విశిష్ట సేవలందిస్తూ, సహోద్యోగుల మన్ననలు పొందడం ఎంతో ప్రశంసనీయమని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.

శుక్రవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ తప్పనిసరన్నారు. వృత్తిలో ఉన్నంతవరకు విధి నిర్వహణ పట్ల ఉద్యోగులు అంకితభావంతో ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ ఉద్యోగ ప్రస్థానాన్ని, ఉద్యోగిగా సమాచార పౌర సంబంధాల శాఖకు అందించిన సేవలను, జీవితంలో కష్టపడి క్రింది స్థాయి నుండి ఉన్నతస్థాయికి ఎదిగిన క్రమం వంటి అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఆయన పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. రిటైర్మెంట్ అనంతరం భావిజీవితం సంతోషంగా, ప్రశాంతంగా కుటుంబసభ్యులతో గడపాలని కాంక్షించారు.

ఉద్యోగ రీత్యా వృత్తినే దైవంగా భావించి, ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ విధి నిర్వర్తించడంలోగానీ, సమయపాలన, క్రమశిక్షణ, సేవ చేయడంలో నిగర్వి, నిరాడంబరుడైన డి. శ్రీనివాస్ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కష్టపడేతత్వం, స్పష్టమైన భావవ్యక్తీకరణ, దూరదృష్టి, అంకిత భావం ఉన్న ఉద్యోగి పదవీ విమరణ చేయడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోవిడ్-19 వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కరోనా నిబంధనలు పాటిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులు ఆయనకు జ్ఞాపికను అందించి, పూలమాల, శాలువాతో సత్కరించారు. పలువురు ఆయన సేవలు కొనియాడుతూ ఘన వీడ్కోలు పలికారు.
కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్లు ఎన్. వెంకటేష్, పి.కిరణ్ కుమార్, కస్తూరి బాయి తేళ్ల, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఓ. మధుసూధన్, డిప్యూటీ డైరెక్టర్లు ఐ.సూర్యచంద్రరావు, ఎం. వెంకటేశ్వర ప్రసాద్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ సి.వి. కృష్ణారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు, పీఆర్వోలు, సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version