విధాత:విజయనగరం జిల్లా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారపూడిలో గల దుర్గాదేవి ఆలయంలో దొంగతనంకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లుగా విజయగనరం డిఎస్పీ పి.అనిల్ కుమార్ తే. 30-08-2021ది, సోమవారం నాడు మీడియా సమావేశంలో తెలిపారు.వివరాల్లోకి వెళితే.. విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో కొత్తగా నిర్మితమై ఆవిష్కరించబడిన శ్రీదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి అలంకరించిన బంగారపు ముక్కు పుడక, ముక్కు నత్తు, మరియు శతమానములుసుమారు ఒక తులం బరువు కలిగిన ఆభరణాలను మరియు హుండీ నందు గల సుమారు 5వేలు రూపాయిలను తే. 14-08-2021ది, అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు గుడి తాళాలు పగులగొట్టి, గుడిలో ప్రవేశించి దొంగిలించుకు పోయారని ఆలయ పూజారి లొల్ల అనంత పద్మనాభ శర్మ విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయనగరం రూరల్ సిఐ మంగవేణి ఆధ్వర్యంలో రూరల్ఎస్ఐ పి.నారాయణ రావు, వారి సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి నిందితులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. విజయనగరం రూరల్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఇదివరలో అనేక దొంగతనాలకు పాల్పడిన బొబ్బిలి మండలం రంగరాజుపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తే. 29-08-2021ది సాయంత్రం 4గంటల సమయంలో విజయనగరం పట్టణ పరిధిలో గల ఆర్.కె టౌన్ షిప్ వద్ద దొంగిలించబడిన బంగారు ఆభరణాలు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందడంతో, విజయనగరం రూరల్ సీఐ ఆదేశాలతో ఎస్ఐ పి. నారాయణ రావు మరియు సిబ్బంది ఆర్.కె. టౌన్ షిప్ వద్దకు చేరుకొని, సదరు ముద్దాయిని అదుపులోకి తీసుకొని,అతని వద్ద నుండి దేవాలయంలో దొంగిలించబడిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని, రిమాండుకు తరలించామని డిఎస్పీ పి.అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ కేసును చేధించడంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన రూరల్ సిఐ టిఎస్ మంగవేణి, విజయనగరం రూరల్ ఎస్ఐ పి. నారాయణరావు, ఎఎస్ఐ త్రినాధరావు,కాని స్టేబుల్ షేక్ షఫీలను అభినందించారు. అదే విధంగా దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో దొంగతనాలు జరగకుండా ఆయా కమిటీ సభ్యులు తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అందుకు అవసరమైన సహాయాన్ని పోలీసుశాఖ నుండి పొందాలని విజ్ఞప్తి చేసారు.
విజయనగరం రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, రూరల్ సిఐ టిఎస్ మంగవేణి, విజయనగరం రూరల్ ఎస్ఐలు పి.నారాయణ రావు, అశోక్ కుమార్
లు పాల్గొన్నారు.