విధాత, హైదరాబాద్ : నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు అదృశ్యం ఘటన విషాదాంతమైంది. ఆయన మృతదేహం విజయవాడలోని ఏలూరు కాలువలో లభ్యమైంది. మధురానగర్ రైలు వంతెన వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. ఎంపీడీవో అదృశ్యమై 8 రోజులు దాటినా ఆచూకీ తెలియలేదు. ఈ నెల 15న ఆయన మధురానగర్ రైలు వంతెన పైనుంచి ఏలూరు కాల్వలో దూకారు. దీనిపై గత వారం రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, పెనమలూరు పోలీసులు గాలింపు చేపట్టారు. ఏలూరు కాలువను పోలీసులు జల్లెడ పట్టారు. మదురానగర్ పైవంతెన పిల్లర్కు చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించారు. దూకిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోనే లభ్యమైంది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసి ఎంపీడీవో కుమారులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 10నుంచి 20వరకు సెలవులు పెట్టిన ఎంపీడీవో రమణారావు పని ఉందంటూ ఈనెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తన పుట్టిన రోజైన ఈనెల 16న కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు. నరసాపురం పరిధిలోని మాధవాయిపాలెం ఫెర్రీ పాటదారు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల గురించి ఎంపీడీవోపై వచ్చిన ఒత్తిళ్లతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.