Site icon vidhaatha

ఎవరిగోల వాళ్లదే.. టీడీపీ, వైసీపీల్లో పట్టనట్లుంటున్న క్యాడర్

ఉన్న‌మాట: తమ పార్టీ అధినేతను ఎవరైనా విమర్శిస్తే విరుచుకుపడే కాలం కాదిది.. తమ పార్టీ జోలికి వచ్చినా.. కార్యాలయం మీద అవతలి పార్టీవాళ్ళు దాడి చేసినా పంచె బిగించి ఎదురెళ్లి అడ్డుకునే రోజులు కావివి. ఎవరికో ఏదో అయితే మాకెందుకు…ఆయన్ను తిడితే నేనెందుకు పోవాలి.. పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే నేనెందుకు అడ్డుకోవాలి అనుకునే రోజులు ఇవి.

అవును పార్టీని, అధినేతను తమ సొంతం అని ఓన్ చేసుకునే రోజులు కావు.. ఆ టైప్ నాయకులూ..కార్యకర్తలూ లేరిప్పుడు.. నా వరకూ వస్తే చూద్దాం లే అనుకునేవాళ్ళు కొందరూ.. ఆ ఇన్నాళ్లూ పార్టీకోసం ఇంత చేసాను..నాకేం ఒరిగిందీ.. ఎందుకీ ఆరాటం అని నిస్తేజంగా ఉండిపోతున్న వాళ్ళు మరికొందరు.ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైఎస్సార్సీపీ.. రెండు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

తాజాగా.. చంద్రబాబు సైతం పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పార్టీ కార్పొరేటర్ మీద అధికారపార్టీ నాయకులు దాడి చేసిన సంఘటనను ప్రస్తావిస్తూ ఇలాంటపుడైనా ఐక్యంగా అడ్డుకోకపోతే ఎలా.. ఇంత ఉదాసీనంగా ఉంటారా ఇదేనా నాయకుల లక్షణం అంటూ చీవాట్లు పెట్టారు.

వాస్తవానికి ఆమధ్య వరకూ బుద్ధవెంకన్న..వర్ల రామయ్య.. జేసీ దివాకర్ వంటి పలువురు నాయకులు ప్రభుత్వం మీద గట్టిగానే ఎదురుతిరిగేవారు. తమ వాయిస్ వినిపించేవారు కానీ రానురానూ ప్రభుత్వం నుంచి నిర్బంధం పెరగడం..కేసులు కోర్టులు.. అరెష్టులతో వాళ్ళలోనూ ధైర్యం సన్నగిల్లింది..ఇంకా ఎన్నికలకు చాలాదూరం ఉంది..ఇప్పట్నుంచే అనవసరంగా ఎందుకు టార్గెట్ అవ్వడం అని వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు.

అయినా కొందరు మాత్రం అక్కడక్కడ గళం విప్పుతూ ముఖ్యమంత్రి జగన్ను, ఆయన కుటుంబీకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని నిన్న జగన్ కేబినెట్ మీటింగులో ప్రస్తావిస్తూ నా కుటుంబాన్ని.. నన్ను తిడుతున్నా మీరు కిక్కురుమనకపోతే ఎలా అని ప్రశ్నించారు. వాస్తవానికి మొన్నటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వరకూ కొడాలి నాని..పేర్ని నాని..అనిల్ వంటి మంత్రులు టిడిపి మీద ఒంటికాలిమీద లేచి విమర్శలు గుప్పించేవారు.

అయితే ఆ ముగ్గురికీ మంత్రిపదవులు తీసేయడంతో ఓస్ ఇంతేనా..మనం ఎంత చేసినా చివరకు దక్కేది ఇదేనా అనుకుంటూ వాళ్ళు సైలెంట్ అయిపోయారు.. దీంతో జగన్ కూడా నన్ను విమరిస్తున్న వాళ్లకు ఎదురుసమాధానం ఇవ్వండయ్యా.. మీ వాయిస్ వినిపించండి అని ఆదేశించారు..అవును కానీ ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలీ అన్నప్పుడు ఇక ఎగరాల్సిన అవసరం ఏముందని ఇరుపార్టీల కార్యకర్తలూ భావిస్తున్నారు.

Exit mobile version