Site icon vidhaatha

Caste enumeration | ఏపీలో ‘కుల గణన’ గడువు పొడిగింపు

Caste enumeration | విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కుల గణన’ ప్రక్రియకు గడువు పొడిగించింది. ఫిబ్రవరి 4 వరకు వివరాల నమోదుకు అవకాశం కల్పించినట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19 నుంచి కుల గణన వివరాల సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివరాల నమోదు కోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించింది. ఈక్రమంలో సిబ్బంది, వాలంటీర్లను క్షేత్రస్థాయికి పంపింది. ఈనెల 29 లోపు కుల గణనను పూర్తి చేయాలని నిర్ణయించింది.


అయితే యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సిబ్బంది వివరాల నమోదులో ఇబ్బందులు పడ్డారు. ఈనేపథ్యంలో సంపూర్ణంగా అందరి వివరాలు నమోదు చేయలేక పోయారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం కుల గణన సర్వేను ఫిబ్రవరి 4 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా గడువు ముగిసిన తర్వాత కూడా నమోదు చేయనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఫిబ్రవరి 7లోగా సంబంధిత వ్యక్తులు నేరుగా తమ ప్రాంతంలోని గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.


కుల గణన నిలిపివేయాలి: ఈసీకి మాజీ ఐఏఎస్ లేఖ


ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘కుల గణన’ సర్వేపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇదే విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ)కి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయని, కుల గణన ద్వారా అధికార పార్టీకి లాభం చేకూరుతుందని ఆయన తన లేఖలో ఆరోపించారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని సీఈసీని కోరారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఈ సర్వే చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు సీఈసీ చర్యలు తీసుకోవాలని శర్మ లేఖలో వివరించారు.

Exit mobile version