- సెబ్ సారధ్యంలో నాటు సారా తయారీ స్థావరాలు, అక్రమ మద్యంపై దాడులు
- 1,05,422 టెట్రా పాకెట్లు, 2,513 మద్యం బాటిళ్లు స్వాధీనం
- 57,115 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం… 3,379 లీటర్ల నాటు సారా పట్టివేత
- 1,263 కేసుల నమోదు, 2,062 మంది అరెస్టు …513 వాహనాల సీజ్
విధాత: అనంతపురం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారథ్యంలో అక్రమ మద్యం,ఇసుక అక్రమ రవాణాపై జూన్ నెలలో విస్తృతంగా దాడులు కొనసాగాయి.కర్నాటక రాష్ట్రం నుండీ జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా జరుగకుండా… జిల్లాలో నాటు సారా తయారీ, విక్రయాలపై పటిష్ట చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో బృందాలు…పోలీసు బలగాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహనరావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు జూన్ నెలలో నాటు సారా తయారీదారులు, విక్రేతలు మరియు మద్యం అక్రమ రవాణాదారులపై నిరంతరం నిఘా వేశారు. జిల్లాలోకి అక్రమంగా కర్నాటక మద్యం రవాణా చేస్తుండటంపై దాడులు నిర్వహించి 1,05,422 కర్నాటక టెట్రా పాకెట్లు, 2,513 ఇతర రాష్ట్రాల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక నుండీ జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిపై 1263 కేసులు నమోదు చేసి 2,062 మంది నిందితులను అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా నాటు సారా స్థావరాలు, విక్రయాలపై దాడులు నిర్వహించి 57,115 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు. 3,379 లీటర్ల నాటు సారా, 513 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కూడా నిరంతరం నిఘా వేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 69 కేసులు నమోదు చేసి 129 మంది అరెస్టు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 84 వాహనాలు పట్టుకుని 336.5 టన్నుల ఇసుక సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తరలిస్తున్న వారిపై 29 ఫైన్ కేసులు నమోదు చేసి 29 వాహనాలు, 29 టన్నుల ఇసుక సీజ్ చేశారు.