అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎక్సైజ్ శాఖ దాడుల్లో రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దాడులు నిర్వహించారు. కడప ప్రొహిబిషన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‍రెడ్డి తెలిపిన వివరాల మేరకు విజయవాడకు చెందిన జనార్దన్‍రావు, అతని అనుచరుడు రాజు కలిసి ములకల చెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నారని… బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి బెల్ట్ షాపులకు సరఫరా చేసేందుకు సిద్దం చేశారని.. అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో బ్రాండ్ల పేర్లతో అమ్మకాలు చేస్తున్నారన్నారని తెలిపారు.
15 వేల నకిలీ మద్యం సీసాలు, 1,050 లీటర్ల స్పిరిట్ క్యాన్లు, 1,500 లీటర్ల బ్లెండ్(తయారైన నకిలీ మద్యం), 10 వేల ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు, స్టిక్కర్లు, తయారీ పరికరాలు, ఇతర సామగ్రితోపాటు సరఫరాకు వినియోగిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లుగా వెల్లడించారు.