విధాత,విశాఖపట్నం:విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఇవాళ పాదయాత్ర చేపట్టారు.కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి దువ్వాడ వరకు సాగిన యాత్రలో పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల కాలనీల్లో పర్యటించారు.
ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను ప్రైవేటుకు అప్పగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని కార్మికులు హెచ్చరించారు.పరిశ్రమ పరిరక్షణే లక్ష్యంగా ఆగస్టు 1, 2 తేదీల్లో ‘చలో పార్లమెంట్’ చేపడుతున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి.కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కూర్మన్నపాలెంలో చేపట్టిన నిరవధిక దీక్షలు 164వ రోజుకు చేరాయి.