విధాత : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష (సమగ్ర భూ సర్వే) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ నేడు భేటీ అయింది.
సచివాలయం మూడవ బ్లాక్ మొదటి అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశానికి డిప్యుటీ సీఎం (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో సభ్య కార్యదర్శి మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్, తదితర అధికారులు హాజరయ్యారు. సమగ్ర భూ సర్వే మరింత ఉధృతంగా, సమర్థవంతంగా అమలు, పురోగతిపై మంత్రుల కమిటీ వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించనుంది. సర్వే పురోగతితో పాటు ఏమైనా సమస్యలుంటే సమీక్షించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను ఇప్పటికే ఈ మంత్రుల కమిటీకి అప్పగించారు. పురోగతితో పాటు తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.