విధాత: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లించడం ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానవత్వం చూపడం కిందకే వస్తుందని శాసనమండలి సభ్యులు, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటి కోఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే… ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేస్తే… బాధితుల సొమ్మును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తప్ప ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ బాధ్యతగా చెల్లించిన దాఖలాలు దేశంలోనే మరెక్కడా లేవని తెలిపారు. పేదల కష్టాలు, బాధలు, అవసరాలు, వారు దాచుకునే చిన్న చిన్న మొత్తాల వెనుక దాగి ఉండే పెద్ద పెద్ద ప్రయోజనాల విలువ బాగా తెలిసిన వారు కనుకనే జగన్ ముఖ్యమంత్రిగానే కాక ఒక గొప్ప మానవతావాదిగా ఈ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపుపై కొన్ని పత్రికలు, కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు కువిమర్శలు చేయడంపై లేళ్ళ అప్పిరెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విలువలు, విశ్వసనీయత, నిబద్ధతతో ముందుకు సాగే ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు సైతం వక్రభాష్యం చెబుతున్న వారికసలు మనస్సాక్షే లేదని మండిపడ్డారు. 20వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన 10.40లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు 905.57కోట్ల రూపాయలను రెండు విడతల్లో సీఎం జగన్ చెల్లించడం పట్ల ఇటు బాధిత కుటుంబాల్లోనే కాక యావత్ రాష్ట్ర ప్రజల్లో కూడా సంపూర్ణ హర్షం వ్యక్తమవుతుంటే… ఇది చూసి ఓర్వలేకనే కొన్ని విష పత్రికలు అవాస్తవ కధనాలను వండి వారుస్తున్నాయని విమర్శించారు. జనం జగన్‌కు జేజేలు పలుకుతుంటే సహించలేని చంద్రబాబు, అచ్చెన్నాయుడు వంటి స్వార్ధ రాజకీయ నాయకులు అగ్రిగోల్డ్ పేరిట అవాకులు చెవాకులు పేలుతున్నారని ఫైర్ అయ్యారు.
అసలు అగ్రిగోల్డ్ అనే పదాన్ని ఉచ్ఛరించే అర్హతే చంద్రబాబుకు లేదని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎందుకంటే… అగ్రిగోల్డ్‌లో 20వేల రూపాయల లోపు పొదుపు చేసిన వారికి ప్రభుత్వమే ముందుగా చెల్లించి ఆ తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులమ్మి తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడే అసెంబ్లీ సాక్షిగా అప్పటిæ తెలుగుదేశం ప్రభుత్వానికి సూచించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అయితే ఆర్‌బిఐ ఒప్పుకోదన్న కుంటిసాకుతో బాధితుల బలవన్మరణాలకు, బాధిత కుటుంబాలు రోడ్డున పడడానికీ ప్రత్యక్ష కారకుడైన చంద్రబాబుకు నేడు దాని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అది కూడా కాక నాలుగున్నరేళ్ళ పాటు న్యాయం చేయండి మహాప్రభో… అంటూ బాధితులంతా ఊపిరి బిగపట్టి మరీ ఉద్యమాలు చేస్తే… ఒక్క రూపాయి చెల్లించిన పాపాన పోలేదు కానీ, అక్రమ కేసులతో వేధించారని వివరించారు.
ప్రజలందరికీ ఈ వాస్తవాలు గుర్తున్నాయనీ… ప్రతిపక్ష నేతగా ఆనాడు ఏదైతే చెప్పారో… మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో… అదే విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశారనీ వివరించారు. అంతే కాక ఈ సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా కూడా చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్న మహోన్నతుడు జగన్ అని తెలిపారు. ఇదంతా కళ్ళ ముందే ప్రత్యక్షంగా కనబడుతున్నా కూడా విషపు రాతలు రాయడానికి చేతులు, వికృతపు మాటలు మాట్లాడడానికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ఇప్పటికైనా విష పత్రికలు, విద్వేషపు నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. లేదంటే చరిత్రలో పుట్టగతులు లేకుండా పోతారని లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు.