కోవిడ్ సెకండ్ వేవ్ ను అధిగమించేందుకు పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలు అత్యంత జాగురుకతతో వ్యవహరించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు.
అందులో భాగంగా సిబ్బంది కి వారు కొన్ని సూచనలు చేశారు.
1) ప్రతి ఒక్కరూ మాస్క్ మరియూ ఫేస్ షీల్డ్ ను తప్పనిసరిగా ధరించాలి. వాటిని శరీరంలోని భాగాలుగా భావించాలి.
2) సానిటైజర్ ని ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను సబ్బుతో శుభ్రపరచు కోవడం వంటి నిబంధనలను పాటించాలి.
3) క్రమం తప్పకుండా ఆవిరి పట్టుకోవడం, వేడి నీటితో నోటిని పుక్కిలించడం, విధుల నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పక స్నానం చేయడం వంటివి అలవర్చుకోవాలి.
4) ప్రతి ఒక్క పోలీస్ అధికారి/సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ గదులు, లాకప్ లు, టాయిలెట్స్ మరియూ పరిసరాలను తప్పని సరిగా సానిటైజ్ చేయాలి.
5) విధులు నిర్వహించే క్రమంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, అదే విధంగా నేరస్తులను అరెస్టు చేసే సమయములో కూడా కోవిడ్ నిభందనలు తప్పక పాటించాలి.
6) ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా మరియూ ప్రాణాయామం చేయాలి.
7) పౌష్ఠిక ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
8) బయట దుకాణాల్లో టీ/కాఫీ తాగడం, కలసి భోజనాలు చేయడం, కలిసి అల్పాహారం భుజించడం మానుకోవాలి.
9) పొగత్రాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్ల కు దూరంగా ఉండాలి.
10) ప్రతి ఒక్కరు సాధ్యమైనంత త్వరగా రెండో విడత టీకాను తీసుకోవాల్సిందిగా విన్నపం. అపోహలు వదిలి, ఒక ఉద్యమంలా 100 శాతం సిబ్బంది టీకాలు తీసుకొని సమాజానికి ఆదర్శం గా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. తమకే కాకుండా, తమ కుటుంబ సభ్యులకు కూడా టీకాలు వేయించాలి.
11) తమ ఆరోగ్యం పట్ల, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం అశ్రద్ధ చేయ రాదు.
12) సిబ్బంది ఆరోగ్యం మరియూ యోగ క్షేమాలను జిల్లా ఎస్పీలు, కమిషనర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ సోకిన Front line workers కు ముఖ్యంగా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు హాస్పిటల్ అడ్మిషన్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. హాస్పిటల్ అడ్మిషన్ లను ఎస్పీలు, కమిషనర్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మందులు, ఆక్సిజన్ సిలిండర్లు కొరత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. యూనిట్ మెడికల్ ఆఫీసర్స్ సైతం కోవిడ్ సోకిన సిబ్బంది మరియూ వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
13) అయితే దురదృష్టవశాత్తు, కొందరు సిబ్బంది తమకు కోవిడ్ సోకిందన్న విషయాన్ని ముందుగా గుర్తించలేక పోతున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణే కొందరి ప్రాణాలకు ముప్పు తీసుకొని వస్తోంది. ఈ అలసత్వం వల్లే, పోలీసు శాఖ సునిశితంగా పర్యవేక్షిస్తున్నా, ఇప్పటికే కొందరిని పోగొట్టుకొన్నాం.
14) కాబట్టి సిబ్బంది తమకు గానీ గానీ/ తన కుటుంబ సభ్యులకు గానీ, ఏ చిన్న ఆరోగ్య పరమైన ఇబ్బంది అనిపించినా అది కోవిడ్ గానే భావించి యూనిట్ మెడికల్ ఆఫీసర్ ను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. తమ ఉన్నతాధికారి ద్వారా జిల్లా కోవిడ్ నోడల్ ఆఫీసర్ ను సంప్రదించాలి. సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు చూసే నిమిత్తం ప్రతి పోలీసు యూనిట్ లో కోవిడ్ నోడల్ ఆఫీసర్లు ఏర్పాటు చేశారనే విషయాన్ని అందరూ గుర్తించాలి. అట్టి కోవిడ్ నోడల్ అధికారి మరియూ జిల్లా ఎస్పీ, కోవిడ్ ట్రీట్మెంట్ ఏర్పాటు కొరకు, హాస్పిటల్ అడ్మిషన్ కొరకు, తగు సూచనలు ఇచ్చే నిమిత్తం, మీకు అండగా వుంటారు.
15) కోవిడ్ సోకిన సిబ్బంది కుటుంబ అవసరాలు చూసే నిమిత్తం ప్రతి పోలీసు స్టేషన్ లో helpdesk ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి హెల్ప్ డెస్క్ ల ను సక్రమంగా వినియోగించుకోవాలి.
16) కోవిడ్ తో పోరాటం చేసే క్రమంలో Front line warriors గా మన కర్తవ్యాన్ని త్రికరణ శుద్దితో నిర్వహిస్తూ ప్రజా సేవలో మమేకమవుదాం. అందు నిమిత్తం మన ఆరోగ్యం కాపాడుకొందాం.
17) పై సూచనలు తప్పక పాటించి, ఈ సారి కూడా కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను.