అనాధ బాలలకు నూతన వస్త్రాలు పంపిణీ
శుభాకాంక్షలు తెలుపుతూ చరవాణిలో మాట్లాడిన ముఖ్యమంత్రి
విధాత,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ జన్మదిన వేడుకలు మంగళవారం విజయవాడ రాజ్ భవన్ లో అతినిరాడంబరంగా జరిగాయి. గౌరవ గవర్నర్ 87 వసంతాలు పూర్తి చేసుకుని 88వ సంవత్సరంలోకి అడుగు పెట్టగా, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమర్ మీనా నేతృత్వంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది కరోనా మార్గదర్శకాలకు లోబడి తమ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపధ్యంలో ఇప్పటికే గవర్నర్ అడంబర జన్మదిన వేడుకలకు దూరమని, శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్ భవన్ కు ఎవ్వరూ రావద్దని స్పష్టం చేసారు.
ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా చరవాణిలో గవర్నర్ తో మాట్లాడి యోగక్షేమాలు విచారించి, తన తరుపున సిఎంఓ నుండి ఉన్నతాధికారులను పంపి ప్రత్యేకతను చాటారు. ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు గవర్నర్ జన్మదినం సందర్భంగా నగరంలోని ఎస్ కెసివి బాలల ట్రస్ట్ అనాధ బాలలకు రాజ్ భవన్ తరుపున నూతన వస్త్రాలు అందించారు. నగరంలో ట్రస్ట్ కు చెందిన మూడు కేంద్రాలు ఉండగా అక్కడి 40 మంది బాలలకు గవర్నర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజనంతో పాటు వస్త్రాలు పంపిణీ చేసారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి తరుపున హాజరైన సాధారణ పరిపాలనా శాఖ ఉప కార్యదర్శి విజయ కృష్ణన్, గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ప్రోటోకాల్ విభాగపు సంచాలకులు బాల సుబ్రమణ్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.