Nimmala Rama Naidu : పనులు ఆపడం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్‌కు దెబ్బ

పోలవరం పనులు ఆపడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

Nimmala Ramanaidu

బనకచర్ల అంశంపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో ఎలాంటి చర్చ జరగలేదని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సోమవారం నాడు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో ఆయన న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, పెండింగ్ బకాయిల విడుదలపై కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు. కేంద్ర మంత్రితో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ హయంలో పోలవరం విధ్వంసం జరిగిందని ఆయన విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినా కూడా జగన్ పట్టించుకోలేదన్నారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పట్టాలు ఎక్కించినట్టు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు 56 శాతం పూర్తయ్యాయని ఆయన చెప్పారు.

2014-19మధ్యలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరం భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేశారని ఆయన అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారని ఆయన తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని, ఈ డెడ్ లైన్ మేరకు పనులు చేస్తున్నామని ఆయన వివరించారు. భారీ వర్షాలు కురుస్తున్నా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగలేదని ఆయన చెప్పారు. 2019లో ఏపీలో టీడీపీ గెలిచి ఉంటే 2021-22 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 17 నెలలు పోలవరం పనులు నిలిచిపోయాయని ఆయన తెలిపారు. ఈ పనులు ఆగిపోవడం వల్లే వచ్చిన వరదలతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని మంత్రి చెప్పారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ఐఐటీ రిపోర్ట్ చెబుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రయోగాలు వద్దని చెప్పినా కూడా జగన్ సర్కార్ వినలేదని ఆయన విమర్శించారు. 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని ఆయన ఎద్దేవా చేశారు. డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా ఆ ప్రభుత్వానికి తెలియదని ఆయన సైటైర్లు వేశారు. పోలవరం ఐదేళ్లు ఆలస్యం కావడంతో రూ. 50వేలు నష్టపోయామని ఆయన అన్నారు. పోలవరం నిర్వాసితులకు జగన్ సర్కార్ ఒక్క పైసా ఇవ్వలేదని ఆయన చెప్పారు.