అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో బుధవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్వామివారి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకాయి. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. లేలేత కిరణాలు స్వామివారిని నాలుగు నిమిషాల పాటు తాకగా..వీక్షించిన భక్తులు ఆనందంతో పరవశించారు. రేపు కూడా ఇలాంటి దృశ్యం కనిపించే అవకాశం ఉందని పూజారులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం మార్చి 9, 10.. అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉదయం 6:05 గంటలకు సూర్య కిరణాలు ఆలయ ద్వారాల ద్వారా నేరుగా సూర్య భగవానుడి పాదాలను తాకుతాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య, శాంతి, శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భానుకిరణాల స్పర్శతో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా కనిపించడం భక్తులలో పులకించారు. ‘ఓం సూర్యనారాయణాయ నమః..’ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు.