అమరావతి : ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల నేపథ్యంలో శ్రీశైలం(Srisailam) జలాశయం గేట్లను అధికారులు మరోసారి ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఈ సంవత్సరంలో శ్రీశైలం డ్యామ్(Srisailam Dam) గేట్లు ఎత్తడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు కారణంగా డ్యామ్ 2గేట్లు 10అడుగుల మేరకు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు(Nagarjuna Sagar Project) నీటి విడుదలు చేస్తున్నారు. జూరాల జలాశయం నుంచి..96,015 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 66,752 క్యూసెక్కులతో శ్రీశైలానికి ఇన్ ఫ్లో 1,62,767 క్యూసెక్కులు వస్తుండగా..ఔట్ ఫ్లో 1,21,330 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులుగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు 3, 10వ నెంబర్ గేట్ల నుంచి నీరు లీకవుతుండటం విమర్శలకు తావిస్తుంది. ఇటీవల వరదలకు ముందే గేట్లకు అధికారులు కొత్త రబ్బర్ సీళ్లు అమర్చారు. రెండు నెలలు తిరగకముందే కొత్త రబ్బర్ సీళ్లు పాడైపోయి గేట్ల నుంచి నీళ్లు లీకేజీ అవుతుండటంతో డ్యామ్ గేట్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది.