విధాత,విజయవాడ: కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసన దీక్ష చేపట్టింది. పశ్చిమ నియోజకవర్గంలో నిరసన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, ఇతర నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ… కోవిడ్ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. చనిపోయిన వారి లెక్కలకు… ప్రభుత్వం చెప్పే లెక్కలకు పొంతనే లేదన్నారు.వంద మంది చనిపోతే ఐదు మరణాలనే చూపిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వమే తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన వారి కుటుంబాలకు 25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్‌ను సీఎం తేలిగ్గా తీసుకోవడం వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం స్పందించి మాటలతో కాకుండా చేతలలో పేదలను ఆదుకోవాలని సూచించారు. నాగుల్ మీరా మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోవిడ్ వల్ల తన కుటుంబంలోనే ఇద్దరిని కోల్పోయినట్లు తెలిపారు. కోవిడ్‌ను జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారన్నారు.
రాజప్రాసాదంలో కూర్చుని పదివేలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. వైసీపీ చేతకాని ప్రభుత్వం కాబట్టే ప్రజలు బాధలు పడుతున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో కూడా ప్రతిపక్ష నేతలపై కక్ష తీర్చుకోవాలని చూశారని వ్యాఖ్యానించారు. అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపేలా కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజల కష్టాలపై సీఎం దృష్టి సారిస్తే మంచిదని హితవుపలికారు.