తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల చిచ్చు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చీలికలకు కారణమవుతుంది. అంతర్గతంగా ఉండే విబేధాలు కాస్తా ఏపీ ఎన్నికల వేళ బహిరంగమవుతున్నాయి.

  • Publish Date - April 27, 2024 / 03:50 PM IST

జనసేన కూటమికి జై కొట్టిన చిరంజీవి
వైసీపీకి మద్దతుగా మరికొందరి ప్రచారం

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చీలికలకు కారణమవుతుంది. అంతర్గతంగా ఉండే విబేధాలు కాస్తా ఏపీ ఎన్నికల వేళ బహిరంగమవుతున్నాయి. ఎన్నికల విషయంలో ఏకతాటిపై ఉండకున్నా న్యూట్రల్‌గా ఉండాల్సిన సినీ పెద్దలు ఎవరి దారిలో వారు తమకు నచ్చిన పార్టీకి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్న పెద్దలు ఏపీ ఎన్నికల్లో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ ఫిలిం నగర్‌లో నడుస్తోంది. సినీ పెద్దల తీరుతో ఏపీలో సినీ పరిశ్రమకు ఎలాంటి కష్టాలు తీసుకొస్తుందోనన్న ఆందోళన పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తుంది.

సినీ ఇండస్ట్రీలోని కొందరు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ…టీడీపీ బీజేపీ కూటమికి మద్ధతునిస్తుండగా, మరికొందరు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా..సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు చేసుకుంటుండటంతో ఫిలిం ఇండ్రస్ట్రీ వర్గాలు వీడిపోతుంది. తమ్ముడు పవన్‌తో పాటు బీజేపీ నేతలకు మెగాస్టార్ చిరంజీవి మద్దతునిస్తున్నారు.

చిరు బాటలోనే అయన సినీ ఫ్యామిలీ, సినీ ప్రముఖులు, బుల్లి తెర నటీనటులు కూటమికి జై కొడుతున్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్ పవన్ కల్యాణ్ గెలుపు కోసం ఇప్పటికే జబర్థస్త్ ఆర్టిస్టులు జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నటుడు నాగబాబు కొడుకు కొణిదెల వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నారు.

మరో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేస్తుండటంతో టీడీపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం సాగిస్తున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉండేవారు..టీడీపీ పార్టీలో ఉన్న నటులు కూటమికి తమవంతు ప్రచారం చేస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ కూడా టీడీపీ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

వైసీపీ నేత బాలినేనికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు ప్రకటించగా…మరో ప్రముఖ నిర్మాత, రచయిత కోనా వెంకట్ జగన్ ప్రభుత్వాన్ని భేష్ అంటున్నారు. ఆయన తీరుపై జనసేన సోషల్ మీడియా విమర్శల దాడి సాగిస్తుంది.సూపర్ స్టార్ కృష్ణపై పవన్ కామెంట్స్ చేయగా, కృష్ణ కుటుంబం నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. పవన్ విమర్శలపై మహేశ్ బాబు మౌనంగా ఉన్నా.. నరేశ్ మాత్రం పవన్‌కు చురకలేశారు.

ఇక దగ్గుబాటి కుటుంబం నుంచి సీనియర్ హీరో వెంకటేశ్ ఆంధ్రతో పాటు, తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆయన రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు పార్టీల తరుపున ప్రచారం చేయనుండటం విశేషం. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి కొడుకు వినాయక్‌రెడ్డిని వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి చేసుకున్నారు.

వియ్యంకుడి గెలుపు కోసం వెంకటేశ్ ఖమ్మం లోక్ సభ పరిధిలో ఒక రోజు ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఏపీలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ గెలుపు కోసం వెంకటేశ్ ప్రచారం చేస్తారని సమాచారం. వెంకటేష్ భార్య నీరజకు కామినేని శ్రీనివాస్ స్వయానా మేనమామ. ఏపీ, తెలంగాణలో రఘురామి రెడ్డి, కామినేని శ్రీనివాస్‌ల కోసం వెంకటేశ్ ప్రచార షెడ్యూల్ సిద్ధమవుతుంది.

అక్కినేని నాగార్జున కుటుంబం మాత్రం ప్రస్తుతానికి తటస్థంగానే ఉంది. ఏకతాటిపై లేని సినీ పెద్దల వ్యవహారం ఇండస్ట్రీ భవిష్యత్‌కు ప్రమాదకరమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సినీ పరిశ్రమ భవిష్యత్ పై ఆలోచన లేకుండా సినీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు పరిశ్రమను అగాధంలోకి నెడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ ఏపీ రాజకీయాల్లో సినీ నటుల ప్రమేయాన్ని కట్టడి చేసేందుకు వారి ఆర్ధిక మూలలపై దృష్టి పెట్టి సినిమాల విడుదల..శ్లాబ్ రేట్లు..టికెట్ల ధరల పెంపు..శ్లాబ్ రేట్లు..వినోద పన్ను వంటి అంశాలపై పలు ఆంక్షలతో టార్గెట్ చేశారు.

ఈ ఎన్నికల్లో సైతం మరోసారి తెలుగు ఫిలిం వర్గాలు తలో రాజకీయ దారి తీసుకోనుండటంతో ఏ పార్టీకి అధికారంలోకి వచ్చినా తమ ప్రత్యర్థి పార్టీకి మద్దతునిచ్చిన ఫిలిం ఇండస్ట్రీ వారిపై కక్ష సాధింపుకు దిగితే పరిశ్రమకే నష్టమంటున్నారు విశ్లేషకులు. గతంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) ఎన్నికల సందర్భంగా, తెలుగు ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష ఎన్నికల్లో పరస్పరం తలపడిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు ఏపీ రాజకీయాలతో మరింత విబేధాలకు గురి కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

Latest News