ఎందుకీ దాపరికం?
తిరుపతి, ఏప్రిల్ 30: కాలుతున్న శవాల కమురు వాసన శ్మశానాల పరిసరాలను కమ్ముకుంటోంది. చితిమంటల్లోంచి ఎగసిపడుతున్న పొగ ఆకాశాన్ని ఆవరిస్తోంది. తిరుపతి నగరంలోని రెండు ప్రధాన శ్మశానవాటికల్లో పగలూ, రాత్రీ తేడా లేకుండానే దేహాలు దహనం అవుతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ మృత్యు బీభత్స వికటాట్టహాసం చేస్తూ వుంటే నిజాలు చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం అబద్ధాల అంకెల్ని నివేదికల్లో ప్రకటిస్తోంది.
ఈ దాపరికమే ప్రజల నిర్లక్ష్యానికి కారణం అవుతోంది. భయంలేని జనం భౌతిక దూరం మరచి, మాస్క్‌లలైనా ధరించకనే విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. వైరస్ ముట్టడించాక, ఆస్పత్రులో బెడ్ దొరకలేదని, ఆక్సిజన్ అందడం లేదని ఆక్రోశిస్తున్నారు.
ఇది ప్రభుత్వ లెక్క: 2021 మార్చి నుంచి ఏప్రిల్ 28 దాకా జిల్లాలో వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 126.
ఇది అసలు నిజం: కరోనాతో జిల్లాలో కన్నుమూసిన వారి సంఖ్య 280.
ఎందుకీ తేడా?: ఇదే అంతుపట్టడం లేదు. రోజూ ప్రభుత్వం విడుదల చేస్తున్న నివేదికలకీ, కాలుతున్న శవాలకీ పొంతన లేదు. సమాచార సేకరణలో సమన్వయ లోపం కారణం కావచ్చు లేదా నిజం చెబితే ప్రజలు పానిక్ అవుతారనే ఆందోళన కావచ్చు. ఇంత పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని వెల్లడైతే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భయం కావచ్చు. మొత్తం మీద శ్మశానాల సాక్షిగా సత్యం సమాధి అవుతోంది.
అధికారిక లెక్కలు ఇవీ..
ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నాటికి జిల్లాలో కొవిడ్ మృతుల సంఖ్య 849. ఏప్రిల్ 29వ తేదీ ఉదయానికి ఆ సంఖ్య 970గా ప్రభుత్వం పేర్కొంది. అంటే మార్చి 1 నుంచీ ఏప్రిల్ 28వ తేదీ వరకూ 59 రోజుల్లో జిల్లాలో 126 కరోనా మరణాలు సంభవించాయని ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మార్చిలో 17 రోజుల పాటు మరణాలేవీ నమోదు కాలేదు.
కేవలం 14 రోజుల పాటే మరణాలు సంభవించాయి. ఈ సమయంలోనూ 11 రోజుల పాటు రోజుకో మరణం మాత్రమే నమోదైంది. రెండు రోజుల పాటు రెండేసి మరణాలు, ఒక రోజు మూడు నమోదయ్యాయి.
ఇక ఏప్రిల్‌లో 29వ తేదీ ఉదయం వరకూ కేవలం ఒక్క రోజు మాత్రమే మరణాలేవీ నమోదు కాలేదు. మిగిలిన 27 రోజుల పాటూ కొవిడ్ చావులు రికార్డయ్యాయి. నాలుగు రోజుల పాటు రోజుకు ఒక మరణం సంభవించగా, ఒక రోజు రెండు, నాలుగు రోజుల పాటు మూడు, ఏడు రోజుల పాటు నాలుగు, పది రోజుల పాటు ఐదేసి, రెండు రోజుల పాటు ఆరు మరణాలు రికార్డయ్యాయి.
పరిశీలనలో..
ప్రభుత్వం కొవిడ్ మరణాలను దాచిపెడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్ క్షేత్రస్థాయిలో వాస్తవాలను సేకరించింది. మండలాల వారీగా వివరాలను సేకరించింది. ఈ 59 రోజుల కాలంలో జిల్లాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య ప్రభుత్వం చెబుతున్నట్టు 126 కాదు.
280 మంది కొవిడ్‌తో మరణించినట్టు క్షేత్రస్థాయి వాస్తవాలు నిర్ధారిస్తున్నాయి. ఈ సమయంలో తిరుపతి అర్బన్ మండలంలో అత్యధికంగా 48 మంది మరణించగా మదనపల్లె మండలంలో 22 మంది కన్నుమూశారు.
పుంగనూరు మండలంలో 15, వి.కోట మండలంలో 14, ఏర్పేడు మండలంలో 11, తిరుపతి రూరల్‌లో 12, పాకాలలో 10, పలమనేరు, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి మండలాల్లో 9 వంతున, పీలేరు, పుత్తూరు మండలాల్లో 8 వంతున, చౌడేపల్లె, పూతలపట్టు మండలాల్లో ఏడుగురి వంతున వైరస్ బారిన పడి చనిపోయారని ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడైంది. అనేక మండలాల్లో ఒకటీ అరా మరణాలు సంభవించాయి.
తిరుపతి లెక్కల్లో తికమక
తిరుపతి నగరంలో కొవిడ్ మృతుల లెక్కలకూ రెండు శ్మశానవాటికల్లో దహనమవుతున్న దేహాలకూ పొంతన కుదరడం లేదు. మార్చి 1 నుంచీ ఏప్రిల్ 26 వరకూ తిరుపతి నగరంలో 20 మంది కొవిడ్‌తో మరణించారని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివరాలు నమోదయ్యాయి. అయితే వారం కిందట తిరుపతి ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ ఒక మీడియా సమావేశంలో వెల్లడించిన అంశం ఈ లెక్కలకు విరుద్ధంగా ఉంది. తిరుపతి రుయా మార్చురీ నుంచీ కుటుంబసభ్యులు తీసుకెళ్ళని 44 మృతదేహాలను మున్సిపల్ యంత్రాంగమే దహనం చేయించిందని వీరు చెప్పారు.
లెక్కల్లో తికమకలకు ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇక ఏప్రిల్ 26 దాకా రుయా, పద్మావతీ ఆస్పత్రుల్లో చనిపోయిన వారి సంఖ్యే 50 దాకా వుంది. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో చనిపోయిన వారు, బయట ప్రాంతాల ఆస్పత్రుల్లో చనిపోయిన వారి వివరాలు లభిస్తే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ సంఖ్య వందకు పైనే ఉండచ్చని అంచనా.
క్యూలో శవాలు
తిరుపతిలోని రెండు ప్రధాన శ్మశానవాటికలు ఎంత ఒత్తిడిలో ఉన్నాయో గమనిస్తే చాలు, కోవిడ్ మరణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్థం అవుతుంది. అంత్యక్రియల కోసం ఒక రోజు ముందు నుంచీ మృతదేహాలు క్యూలో ఎదురు చూడాల్సిన పరిస్థితి తిరుపతిలో ఉంది.
కరకంబాడి రోడ్డులోని గోవింద ధామం శ్మశానవాటికను పూర్తిగా కోవిడ్ మృతదేహాల దహనాలకే కేటాయించారు. ఇది విద్యుత్ దహనవాటిక. రెండు చాంబర్‌లున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు ఆరు లేదా ఏడు మృతదేహాలు గోవిందధామానికి అంత్యక్రియలకోసం వచ్చేవి. ప్రస్తుతం రోజుకు 22 భౌతిక కాయాలు రోజూ ఇక్కడ దహనం అవుతున్నాయి.
నిజానికి ఈ విద్యుత్ దహనవాటిక సామర్ధ్యం రోజుకి 18 మృతదేహాలు మాత్రమే. ఉదయం 8నుంచి సాయంత్రం 6 దాకా దహనసంస్కారాలకు అనుమతించేవారు. ప్రస్తుతం ఉదయం 7 నుంచీ రాత్రి పదిదాకా శవాలు బూడిదవుతూనే ఉన్నాయి. ఒక మృతదేహం బూడిదగా మారి మరొకదాని కోసం చాంబర్‌ను సిద్ధం చేయడానికి గంట సమయం పడుతుంది.
ఇప్పుడు అందుకు అవకాశం ఉండడం లేదు. వచ్చి పడుతున్న శవాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ముందే స్లాట్లు ఇస్తున్నారు. ఏ రోజుకి ఆరోజు స్లాట్లు ఇచ్చే పరిస్థితి నుంచి మరుసటి రోజు దహనం చేయాల్సిన 22 మృత దేహాలకు ముందు రోజే స్లాట్ కేటాయిస్తున్నారు. అయినా ఒత్తిడి తీవ్రంగా ఉంది.
ఉష్ణోగ్రత 1200 డిగ్రీలకు మించితే ఈ చాంబర్‌లు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో రాత్రి 9 గంటలపాటూ చల్లబరిచి తిరిగి దహనాలకు సిద్ధం చేస్తున్నారు.గోవిందధామంలో ఏప్రిల్ 1 నుంచీ 27 వరకూ అంటే 27 రోజుల వ్యవధిలో 242 కొవిడ్ మృతదేహాలకు దహన క్రియలు జరిగాయి. అయితే ఇవన్నీ జిల్లాకే సంబంధించినవి కాదు. స్విమ్స్, రుయా, కొన్ని పెద్ద ప్రైవేటు ఆస్పత్రులున్న తిరుపతిలో కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన కోవిడ్ బాధితులు కూడా చికిత్స పొందుతుంటారు. ఇక్కడే మరణించినవారి మృతదేహాల్లో చాలావాటిని వారి కుటుంబసభ్యులు సొంత ప్రాంతాలకు తీసుకువెళ్లడం లేదు.
తిరుపతిలోనే అంత్యక్రియలు పూర్తి చేసేస్తుంటారు. అయితే వీరి సంఖ్య తక్కువే ఉంటుంది. గత ఏడాది, అంటే కరోనా తొలి అల తాకిన కాలంలో మే నుంచీ డిసెంబరు దాకా 783 కొవిడ్ మృత దేహాలకు గోవిందధామంలో దహన క్రియలు జరిగాయి. రెండో అల తాకిన 27రోజుల వ్యవధిలో 242 మృతదేహాలకు అంత్యక్రియలు ఇక్కడ జరిగాయి. ఇందులో 95 శాతం జిల్లాకు సంబంధించినవే. ఇక తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలోని ఆరు చితులు కూడా ఆరడమే లేదు. ఇక్కడకు సాధారణ రోజుల్లో రోజుకు మూడు మృతదేహాలు అంత్యక్రియల కోసం వచ్చేవి.
ప్రస్తుతం 9 నుంచి 12 వస్తున్నాయి. ఇక్కడున్న ఆరు చితుల్లో మూడింటిని సాధారణ మరణాలకు కేటాయించారు. సాయం త్రం అయిదున్నరకే మూతబడే ఈ శ్మశాన వాటికలో ప్రస్తుతం రాత్రి 9 దాకా కూడా శవాలు కాలుతున్నాయి. హరిశ్చంద్ర శ్మశానవాటికలో ఈ నెల ఒకటి నుంచీ 27వ తేదీ వరకూ 105 మృతదేహాలకు దహనక్రియలు జరిగాయి. వాటిలో కొవిడ్ బాధితులవి 90 శాతం ఉన్నాయి.
ఈ రెండు శ్మశాన వాటికల్లో 27 రోజుల్లో దహనమైన 347 మృతదేహాల్లో 90 శాతానికి మించి కొవిడ్ బాధితులవే. అందులోనూ 80 శాతం స్థానికుల మృతదేహాలే అని అంచనా. మరి ఈ లెక్కలకీ ప్రభుత్వ నివేదికల్లోని లెక్కలకీ ఎక్కడా సరిపోలకపోవడమే విచిత్రం.