విధాత:కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో భాగంగా కృష్ణాజిల్లా పూర్వపు కలెక్టరు ఏ.యండి.ఇంతియాజ్ డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టరు యం.శ్రీనివాసరావులపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.దేవానంద్ రీకాల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.అర్హత ఉన్నా వైయస్ఆర్ చేయూత పధకం తమకు వర్తింప చేయడం లేదంటూ కృష్ణాజిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. లబ్ధిదారులకు ప్రయోజనాన్ని కల్పించాలని గత ఏడాది అక్టోబరు 22న హైకోర్టు సంబంధిత అధికారులకు సూచిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
నిధులు మంజూరు అయినప్పటికీ తమకు ప్రయోజనాలు కల్పించడం లేదని తిరిగి అధికారులపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేయడం జరిగింది. దీనిపై వాదనలు వినిపించేందుకు అప్పటి కలెక్టరు డిఆర్‌డిఏ పిడి లేదా వారి తరపున న్యాయవాదులు సైతం కోర్టుకు హాజరు కాకపోవడంతో హైకోర్టు న్యాయమూర్తి నాన్ బెయిల్ బుల్ వారెంట్‌ను జారీ చేయడం జరిగింది. దీనిపై పూర్వపు జిల్లా కలెక్టరు ఏ.యండి.ఇంతియాజ్, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసులు మంగళవారం హై కోర్టుకు హాజరై తమపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. కోర్టుకు హాజరు కావాలన్న సమచారాన్ని జిల్లా కలెక్టరు కార్యాలయానికి చెందిన సిబ్బంది తమకు సమాచారం అందజేయలేదని దీనివలన కోర్టుకు హాజరు కాలేకపోయామని, కనుక వారెంట్‌ను రీకాల్ చేయాలని కోరడంతో వారి సమాధానంపై సంతృప్తి చెందిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.దేవానంద్ వారెంట్‌ను రీకాల్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసారు.